Nepal Protests: నేపాల్‌లో శాంతిభద్రతలు చేయిదాటిపోయాయి. సోషల్ మీడియా నిషేధాన్ని నిరసిస్తూ ప్రారంభమైన నిరసనలు ప్రధానమంత్రి రాజీనామా చేసేదాకా వెళ్లాయి. సోమవారం పలువురు పోలీసులు కాల్పుల్లో మృతి చెందడంతో మంగళవారం నిరసనకారులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. పరిస్థితులు చేయి దాటిపోవడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది.
కాగా ఆర్థికమంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌పై దాడి చేశారు. అతన్ని వీధుల్లో ఉరికిస్తూ జనం దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. కఠ్మాండూ వీధుల్లో అతని తరుముతూ నిరసన కారులు దాడి చేయడం దేశంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో తెలుస్తోంది. పౌడెల్‌నె కొంతమంది యువకులు ఎగిరెగిరి తన్నడం వీడియోలో కనిపిస్తోంది.
మంగళవారం పలు చోట్లా కర్ఫ్యూ ఉన్నా ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. అవినీతి ప్రభుత్వం గద్దె దిగిపోవాలని నినాదాలు చేస్తూ కఠ్మాండూలోని పార్లమెంటు భవనంలోకి చొచ్చుకెళ్లారు. మరికొంతమంది ప్రధానమంత్రి, అధ్యక్షుడికి చెందిన ప్రైవేటు నివాసాలకు నిప్పు పెట్టారు.
సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ సోమవారం జరిగిన ఘర్షణలో 19 మంది చనిపోవడంతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినా నిరసనకారులు శాంతించలేదు. అవినీతి ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని రోడ్లను దిగ్బందం చేశారు.
ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈ ఘర్షణలకు బీజం పడింది.
సోమవారం అర్థరాత్రి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా ప్రజలు శాంతించలేదు. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలనే డిమాండ్‌తో మంగళవారం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. దీంతో ఓలీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది.
భారతీయులకు సూచన
నేపాల్ అంతకంతకు పెరుగుతున్న హింస దృష్యా ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎవరూ బయటకు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.
ఆర్మీ బ్యారక్స్‌కు వీఐపీలు..
నేపాల్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశంలో అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులతో పహారా కాస్తున్నారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హెలికాప్టర్ల కదలికలు కనిపించాయి. అలాగే నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలోని ఆర్మీ బ్యారక్స్‌లోకి వీఐపీలను పంపిస్తున్నారు.
విమానాల దారి మళ్లింపు..
కాగా ఢిల్లీ నుంచి కాఠ్‌మాండూ బయల్దేరిన రెండు ఇండిగో విమానాలకు త్రిభువన్ ఎయిర్‌పోర్టు నుంచి క్లియరెన్స్ లభించలేదు. దాంతో వాటిని దారి మళ్లించారు. అవి లఖ్‌నవూలో ల్యాండ్ అయ్యాయి. ఈ పరిణామాలతో భారత రాయబార కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. 977-9808602881, 977-9810326134 నంబర్లను అందుబాటులో ఉంచారు.


