Nepal PM Resign: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగడంతో కేపీ ఓలీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా నిషేధంపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో పలువురు మంత్రులు సైతం వరుసగా రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని సైతం రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నేపాల్ హింసాత్మకంగా మారడంతో కేపీ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం
కేపీ శర్మ ఓలీ రాజీనామాకు గల ప్రధాన కారణాలు:
సామాజిక మాధ్యమాలపై నిషేధం: ప్రభుత్వం ఇటీవల ఫేస్‌బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి 26 సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధం విధించింది. దీనికి నిరసనగా ‘జెన్-జెడ్’ నినాదంతో యువత భారీగా నిరసనలు చేపట్టారు.
అవినీతి ఆరోపణలు: ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలోని అవినీతికి వ్యతిరేకంగా… నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులు ఆయన అధికారిక నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు.
నిరసనకారులపై హింసాత్మక చర్యలు: నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం బలప్రయోగం చేయడంతో.. దేశం మెుత్తం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో సుమారు 20 మందికి పైగా నిరసనకారులు మరణించడం జరిగింది. దీంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.
సైన్యం నుంచి ఒత్తిడి: దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనడంతో సైన్యం సైతం కేపీ శర్మ ఓలీని పదవి నుంచి.. దిగిపోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. హోంమంత్రి రమేశ్ లేఖక్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నేపాల్‌లో అనిశ్చిత వాతావరణం నెలకొని ఉంది.


