Nepal Protests: నేపాల్‌లో సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌కు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన ఆందోళనలో పోలీసులు జరిపిన కాల్పులు, ఇతర ఘర్షణలో 19 మంది చనిపోగా 300 మంది దాకా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వం విధించిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపైన నిషేధం ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. ఆందోళనలను విరమించాలని విజ్ఞప్తి చేసింది.
మంగళవారం అదే ఆందోళన
అయితే సోమవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది చనిపోవడాన్ని నిరసిస్తూ ఖాఠ్మండులోని నేపాల్ పార్లమెంటు బయట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. కాగా నిరసనకారులు సీఎం ఇల్లు ‘మాదేశ్’పైకి రాళ్లు విసిరినట్లు సమాచారం. దీంతో అక్కడ అరెస్టు పర్వం మొదలైందని తెలుస్తోంది. దీంతో కర్ఫ్యూ ప్రకటించారు పోలీసులు.
కాగా సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనల వెనుక అదృశ్య శక్తులున్నాయని, కొంత మంది స్వార్థ ప్రయోజనాలకోసం చేస్తున్నట్లు ప్రధాని కేపీ శర్మ ఒలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన కాల్పుల్లో మరణించిన మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. అయితే నేపాల్‌లో సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు ఎలాంటి పాలసీ రూపొందించడం లేదని ప్రధాని ప్రకటించారు. సోషల్ మీడియాను పూర్తి నియంత్రించడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.
అయినా మంగళవారం దేశంలోని పలు చోట్లా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారులు ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రధాన రహదారులను దిగ్భందిస్తున్నారు.
కాగా, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, చైనా యాప్ టాన్సెంట్, స్నాప్‌షాట్, పింట్రెస్ట్ వంటి మొత్తం 22 యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో నేపాల్‌లోని పలు వర్గాలు తీవ్రస్థాయి నిరసనలు చేపట్టారు. దీంతో సోమవారం అదుపు తప్పాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు.
నిరసనలతో దిగొచ్చిన నేపాల్ ప్రభుత్వం..
‘ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నాం. దయచేసి ఆందోళనలు విరమించండి’ అని కమ్యూనికేషన్ల మంత్రి గురుంగ్ కోరారు.
అటు నిరసనలో పలువురు చనిపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండువారాల్లో ఆందోళనలకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపి నివేదిక రెడీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా మంగళారం మళ్లీ నిరసనలు చెలరేగడంపై ప్రధాని ఒలీ ప్రతిపక్షాలపై భగ్గుమన్నారు. ఈ నిరసనల వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆరోపించారు. తాము సోషల్ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేసినా మళ్లీ ఆందోళన కొనసాగించడంపై ఆయన కినుక వహించారు.


