Nepal political crisis: హిమాలయ దేశం నేపాల్‌లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో యువత చేపట్టిన ఆందోళనల సెగకు ఏకంగా ప్రభుత్వమే కుప్పకూలింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ తన మంత్రివర్గంతో సహా రాజీనామా చేయగా, ఆ స్థానంలో అనూహ్యంగా ఓ టెక్నోక్రాట్ పేరు తెరపైకి వచ్చింది. దేశాన్ని వెలుగులతో నింపిన విద్యుత్ బోర్డు మాజీ ఎండీ, కుల్మన్ ఘీసింగ్‌ను తాత్కాలిక ప్రధానిగా నియమించారు.
సామాజిక మాధ్యమాలపై నిషేధం.. అల్లర్లకు ఆజ్యం
ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో నేపాల్‌లో ఒక్కసారిగా అల్లర్లు ప్రజ్వరిల్లాయి. ముఖ్యంగా ‘జెన్-జెడ్’ (Gen-Z)గా పిలుచుకునే యువత పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి ఆందోళనలకు దిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారి, దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.
ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి.. ప్రధాని రాజీనామా
యువత ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో వైఫల్యం చెంది, నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి, మంత్రివర్గంతో సహా రాజీనామా చేశారు. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
యువత గళం.. తెరపైకి కుల్మన్ ఘీసింగ్ పేరు
ఈ రాజకీయ శూన్యతను పూడ్చేందుకు, ఆందోళనలు చేస్తున్న ‘జెన్-జెడ్’ యువత అనూహ్యంగా కుల్మన్ ఘీసింగ్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించింది. గతంలో నేపాల్ విద్యుత్ బోర్డుకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన కుల్మన్, దేశంలో విద్యుత్ కోతలకు చరమగీతం పాడి, ప్రజల మన్ననలు పొందారు. ఆయన పాలనా దక్షత, నిజాయతీని గుర్తించిన యువత, దేశాన్ని నడిపించే సత్తా ఆయనకు ఉందని బలంగా విశ్వసించింది.
అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయం రావడంతో, కుల్మన్ ఘీసింగ్‌ను నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నియమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో వెలువడే అవకాశం ఉంది.


