Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nepal: నేపాల్‌లో అల్లకల్లోలం... మాజీ ప్రధాని దంపతులపై కర్రలతో దాడి

Nepal: నేపాల్‌లో అల్లకల్లోలం… మాజీ ప్రధాని దంపతులపై కర్రలతో దాడి

Nepal-Ex Prime Minister:నేపాల్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వ అవినీతి, నాయకుల వైఫల్యాలపై నెలలుగా ఉడుకుతున్న ప్రజా అసంతృప్తి ఇప్పుడు అల్లర్ల రూపం దాల్చింది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన శాంతియుత నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారి, ప్రజాస్వామ్య వ్యవస్థనే కుదిపేస్తున్నాయి.

- Advertisement -

దేవుబా నివాసాన్ని ముట్టడించిన..

ఖాట్మండు సహా అనేక పట్టణాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేలాది మంది ప్రజలు నిన్న  ఒక దారుణ ఘటనకు కారణమయ్యారు. దేశ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య అర్జు రాణా దేవుబా నివాసాన్ని ముట్టడించిన నిరసనకారులు అదుపు తప్పి దాడికి దిగారు.

నిరసనకారుల బీభత్సం..

బుధానీలకంఠ ప్రాంతంలో ఉన్న దేవుబా ఇంటిపై నిరసనకారుల బీభత్సం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఉన్న వందలాది మంది నిరసనకారులు భద్రతా సిబ్బందిని తోసిపుచ్చి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో 77 ఏళ్ల దేవుబా భార్యతో కలిసి లోపలే ఉన్నారు. వారిని బలవంతంగా బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టారు. కర్రలతో మాజీ ప్రధానికి గాయాలు కలిగించగా, ఆయన భార్య అర్జు రాణాపై కూడా దాడి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించిన దాడిలో ఆమె రక్తసిక్తమయ్యారు.

అత్యవసరంగా..

ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన దేవుబా దంపతులను సైన్యం అక్కడి నుంచి అత్యవసరంగా తరలించింది. వారిద్దరినీ సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవ్వడంతో దేశంలో వాతావరణం మరింత ఉద్రిక్తమైంది.

సమ్మెలతో శాంతిభద్రతలు

ఇకపోతే, ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న నిరసనలు, నిరవధిక సమ్మెలతో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ చివరకు నిన్న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో అధికారంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీంతో దేశం పాలనలో ఖాళీ పరిస్థితి నెలకొంది.

ప్రచండ రాజీనామా తరువాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. క్రమం తప్పకుండా హింస పెరుగుతుండటంతో సైన్యం అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రంగప్రవేశం చేసింది. రాజ్యాంగాన్ని రక్షించడమే కాకుండా దేశంలోని కీలక కేంద్రాలను అదుపులోకి తీసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగింది. రాజధాని ఖాట్మండులోని సింగ్‌దర్బార్ సెక్రటేరియట్, పార్లమెంట్ భవనం, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు సైన్యం ఆధీనంలోకి వెళ్లాయి.

500 మందికిపైగా..

గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. అనధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 40 మందికి పైగా మరణించగా, 500 మందికిపైగా గాయపడ్డారు. ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఆహారం, ఔషధాల కొరత కూడా తలెత్తింది.

Also Read:https://teluguprabha.net/devotional-news/navratri-2025-significance-of-nine-forms-of-goddess-durga/

సైన్యం చీఫ్ ప్రభురామ్ శర్మ దేశ ప్రజలకు శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. హింస ఆపాలని, శాంతియుత మార్గంలో సమస్యల పరిష్కారం కోరాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసనకారులు క్రమశిక్షణ పాటించకపోతే పరిస్థితి నియంత్రణలో ఉండదని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad