Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nepal : 'సోషల్' సెగలు.. నేపాల్‌లో నెత్తుటి ప్రవాహం!

Nepal : ‘సోషల్’ సెగలు.. నేపాల్‌లో నెత్తుటి ప్రవాహం!

Deadly protests in Nepal over social media ban : ప్రశాంత హిమాలయ దేశం నేపాల్‌లో అంతర్యుద్ధాన్ని తలపించే వాతావరణం నెలకొంది. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం విధించిన నిషేధం, యువత ఆగ్రహానికి ఆజ్యం పోసింది. వీధుల్లోకి వచ్చిన వేలాది మంది నిరసనకారులపై పోలీసుల కాల్పులతో కాఠ్‌మాండు రణరంగంగా మారింది. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య 19కి చేరడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హింసాత్మక పరిణామాల నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలేంటి..? ఒక డిజిటల్ నిషేధం వీధి యుద్ధంగా ఎందుకు మారింది.?

- Advertisement -

నిషేధానికి దారితీసిన కారణం  : నేపాల్ ప్రభుత్వం ఇటీవలే కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. దేశంలో కార్యకలాపాలు సాగించే అన్ని సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది. ఆగస్టు 28 నుంచి ఏడు రోజుల గడువు విధించింది. అయితే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఎక్స్,  యూట్యూబ్ వంటి దిగ్గజ సంస్థలు గడువులోగా రిజిస్టర్ చేసుకోలేదు. టిక్‌టాక్, వైబర్ వంటి కొన్ని యాప్‌లు మాత్రమే నిబంధనలను పాటించాయి. దీంతో, రిజిస్టర్ చేసుకోని యాప్‌లపై ప్రభుత్వం గత గురువారం నుంచి నిషేధాన్ని అమలు చేసింది.

వీధుల్లోకి యువత.. హింసగా మారిన ఆందోళన : ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా యువత భగ్గుమంది. ఫేస్‌బుక్, వాట్సప్ వంటివి కేవలం వినోద సాధనాలే కాదు, లక్షలాది మందికి భావప్రకటన వేదికలు. ముఖ్యంగా, విదేశాల్లో నివసిస్తున్న సుమారు 70 లక్షల మంది నేపాలీలు, తమ కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి వీటిపైనే ఆధారపడతారు. నిషేధం వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువత కాఠ్‌మాండు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్న ఆందోళనకారులను భద్రతా దళాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జల ఫిరంగులు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో, కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

రాజకీయ ప్రకంపనలు – హోంమంత్రి రాజీనామా : పరిస్థితి అదుపు తప్పడం, అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ హింసకు నైతిక బాధ్యత వహిస్తూ, హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ పరిణామం ఓలి ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది.

ప్రభావం.. ప్రభుత్వ పునరాలోచన : ప్రభుత్వ నిషేధం రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను, సమాచార హక్కును కాలరాయడమేనని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య తీవ్రంగా విమర్శించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు, అంతర్జాతీయంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో, నేపాల్ సర్కార్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. నిషేధాన్ని ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తున్నారని, మరికొన్ని గంటల్లో దీనిపై కీలక నిర్ణయం వెలువడవచ్చని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad