Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nepal Protest: యువతకు హితవు పలికిన ఖాట్మండు మేయర్ బలేన్..!

Nepal Protest: యువతకు హితవు పలికిన ఖాట్మండు మేయర్ బలేన్..!

Nepal Protest: పొరుగుదేశం నేపాల్ లో రాజకీయ సంక్షోభం సంభవించింది. రాజకీయ నేతల అవినీతికి వ్యతిరేకంగా, పారదర్శకత లోపించిందంటూ యువత (జెన్-జీ) చేసిన చారిత్రాత్మక ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో నేపాల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఆందోళనలకు వెన్నుదన్నుగా నిలిచిన ఖాట్మండు మేయర్, ప్రముఖ రాపర్ బలేంద్ర షా (బలేన్) దేశంలో ఏర్పడబోయే మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారు. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరారు.

- Advertisement -

ఈ కీలక సమయంలో యువత సంయమనం పాటించాలని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. “జెన్-జీ, నేపాల్ ప్రజలకు” అంటూ సోషల్ మీడియాలో బలేన్ ఓ పోస్టు పెట్టారు. “దయచేసి ఈ సమయంలో ఆందోళన చెందవద్దు, ఓపికగా ఉండండి. ఇప్పుడు దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడబోతోంది. సరికొత్త ప్రజాతీర్పు కోసం ఎన్నికలు నిర్వహించడమే ఈ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన విధి” అని ఆయన పేర్కొన్నారు. హిమాలయ దేశం సువర్ణ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.

Read Also: Bigg Boss: ఓటింగ్ లో సీరియల్ హీరోయిన్ టాప్.. లీస్ట్ లో కొరియోగ్రాఫర్..!

సుశీలా కర్కీ పేరుని..

మధ్యంతర ప్రభుత్వ అధినేత పాత్రకు సుశీలా కర్కీ పేరును తాను బలపరుస్తున్నట్లు 35 ఏళ్ల బలేన్ స్పష్టం చేశారు. “మీ అవగాహన, విచక్షణ, ఐక్యతను నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. ఇది మీ పరిణతికి నిదర్శనం” అని యువతను ఉద్దేశించి అన్నారు. నాయకత్వ పదవుల కోసం ఆత్రుత పడుతున్న మిత్రులకు ఆయన ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. “ఇప్పుడే తొందరపడి రావాలనుకుంటున్న మిత్రులారా, మీ అభిరుచి, ఆలోచన, నిజాయతీ దేశానికి తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా అవసరం. దానికోసం ఎన్నికలు వస్తాయి. దయచేసి తొందరపడకండి” అని ఆయన హితవు పలికారు. యువత సాధించిన ఈ చారిత్రాత్మక విప్లవాన్ని కాపాడేందుకు పార్లమెంటును తక్షణమే రద్దు చేసి, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేయర్ బలేన్ దేశాధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌కు విజ్ఞప్తి చేశారు.

Read Also: Acid Reflux: కడుపులో మంట సమస్య ఎలా తగ్గించుకోవాలంటే?


నేపాల్ ప్రభుత్వం..

ప్రస్తుతం నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓలీ ప్రభుత్వం ఆందోళనకారులపై జరిపిన అణిచివేతలో 30 మందికి పైగా మరణించారు, కాగా, ఈ ఆందోళనలో 500 మందికి పైగా గాయపడ్డారు. ప్రతిగా నిరసనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టి, రాజకీయ నాయకులపై దాడులు చేశారు. దీంతో దేశంలో శాంతిభద్రతల బాధ్యతను సైన్యం స్వీకరించింది. లూటీలు, విధ్వంసం లేదా దాడులకు పాల్పడితే కఠినంగా స్పందిస్తామని సైన్యం హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad