Charles Sobhraj: నేపాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, దీనికి జైలు అధికారులు నిరాకరించారు. 1975లో నేపాల్‌కు వచ్చిన అమెరికన్ టూరిస్టుల్ని చార్లెస్ శోభరాజ్ హత్య చేశాడు. అమెరికాకు చెందిన జో బొరోంజిచ్ అనే వ్యక్తిని, కెనడాకు చెందిన అతడి ప్రేయసిని హత్య చేశాడు.
దీంతో అతడిపై హత్య కేసు నమోదైంది. అప్పుడు అతడు తప్పించుకుని పారిపోయాడు. తర్వాత 2003లో నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసుపై విచారణ జరిపారు. నేపాల్ కోర్టు అతడికి 21 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో అప్పటి నుంచి జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి శిక్షాకాలం మరో రెండేళ్లు ఉంది. అతడి వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. దీంతో అతడి వృద్ధాప్యాన్ని, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న నేపాల్ కోర్టు అతడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
విడుదల అనంతరం 15 రోజుల్లోగా దేశం నుంచి పంపించివేయాలని కూడా ఆదేశించింది. అయితే, జైలు అధికారులు దీనికి నిరాకరించారు. నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ, అతడ్ని విడుదల చేసేందుకు అంగీకరించడం లేదు. కోర్టు తీర్పు అస్పష్టంగా ఉందని జైలు అధికారులు అంటున్నారు. అసలు ఏ కేసు విషయంలో అతడ్ని విడుదల చేయమని కోర్టు ఆదేశించిందో తెలియడం లేదన్నారు.
దీంతో చార్లెస్ శోభరాజ్ విడుదల విషయంలో సందిగ్ధత నెలకొంది. చార్లెస్ అనేక దేశాల్లో హత్యలకు పాల్పడ్డాడు. ఇండియాతోపాటు నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్ వంటి దేశాల్లో హత్యలు చేశాడు. సీరియల్ కిల్లర్‌గా గుర్తింపు పొందిన అతడ్ని ‘బికినీ కిల్లర్’ అని కూడా అంటారు. బికినీ ధరించిన మహిళల్ని ఎక్కువగా హత్య చేయడం వల్ల చార్లెస్‌కు బికినీ కిల్లర్ అనే పేరు వచ్చింది.