Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nepal PM: వంటగదిలో శబ్దం సహజం - భారత్‌తో బంధంపై సుశీల వ్యాఖ్యలు

Nepal PM: వంటగదిలో శబ్దం సహజం – భారత్‌తో బంధంపై సుశీల వ్యాఖ్యలు

Nepal New PM Sushila Karki: నేపాల్‌ మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కి.. భారత్‌తో తమ సంబంధాలపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో నేపాల్‌కు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని సుశీల కార్కి అన్నారు. మోదీపై తనకు మంచి అభిప్రాయం ఉందని తెలిపారు. వంటగదిలో గిన్నెలు ఉన్నప్పుడు అవి చప్పుడు చేయడం సహజం.. అలాంటివి జరుగుతూనే ఉంటాయంటూ భారత్‌తో బంధంపై కార్కి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమే అయినా.. ప్రజల మధ్య సంబంధాలు ఎంతో బలమైనవని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

భారత్-నేపాల్ బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు: జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశీల కార్కి భారత్-నేపాల్ బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల సంబంధాలను వివరిస్తూ, “వంటగదిలో గిన్నెలు ఉన్నప్పుడు అవి చప్పుడు చేయడం సహజం” అనే హిందీ సామెతను ఉదహరించారు. మా బంధువులు, స్నేహితులు ఎందరో భారత్‌లో ఉన్నారని తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఎంతో ప్రేమ, సద్భావన ఉన్నాయని అన్నారు. కష్టకాలంలో నేపాల్‌కు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

Also Read: https://teluguprabha.net/international-news/un-human-rights-body-reports-on-north-koreas-oppression/

గంగా నది తీరంలోని హాస్టల్ మరచిపోలేని జ్ఞాపకం: తనకు భారత్‌తో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని సైతం కార్కి గుర్తుచేసుకున్నారు. తాను వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో మాస్టర్స్ చదివిన రోజులను నెమరువేసుకున్నారు. తన గురువులు, స్నేహితులు ఇప్పటికీ భారత్‌లో ఉన్నారని అన్నారు. గంగా నది తీరంలోని మా హాస్టల్ సైతం జ్ఞాపకం ఉందని తెలిపారు. వేసవి రాత్రుల్లో మేమంతా ఆ భవనంపైన నిద్రపోయేవాళ్లమంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. తన స్వస్థలం బిరాట్‌నగర్ భారత సరిహద్దుకు కేవలం 25 మైళ్ల దూరంలోనే ఉందని తెలిపారు. చిన్నప్పుడు తరచుగా సరిహద్దు మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొనుగోలు చేసేదాన్నని ఆమె అన్నారు. భారత నాయకులను సోదర సమానులుగా భావిస్తామని తెలిపారు. వారి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని కార్కి అన్నారు.

అంతర్జాతీయ గుర్తింపు: 73 ఏళ్ల సుశీల కార్కి గతంలో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా (2016-2017) సైతం పనిచేశారు. అవినీతి కేసుల్లో పలువురు రాజకీయ నాయకులకు శిక్షలు విధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన సోషల్ మీడియా నిషేధంపై జరిగిన యువ నిరసన ఉద్యమం ఫలితంగానే ఆమె మధ్యంతర ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad