Sushila Karki: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. దేశానికి కొత్త మార్గాన్ని చూపుతూ, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. నేపాల్ రాజకీయ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా ఆమె ఈ అరుదైన ఘనత సాధించారు. దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, పలు రాజకీయ పార్టీల నాయకులు, జన్ జడ్ (జనరేషన్ జెడ్) ఉద్యమకారులు, న్యాయ నిపుణులు మరియు ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌లతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం రాత్రి 9.30 గంటలకు నేపాల్ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశానికి కొత్త ఆశలను నింపింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, సుశీలా కర్కి కొద్దిమంది మంత్రులతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో, దేశంలో సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు వచ్చే ఏడాది మార్చిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సుశీలా కర్కి ఎంపిక వెనుక అధ్యక్షుడు పౌడెల్ ముందుచూపు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలు, న్యాయ వ్యవస్థలో ఆమెకున్న నిబద్ధత, నిష్పక్షపాత వైఖరి ఆమెను ఈ బాధ్యతలకు అర్హురాలిగా నిలిపాయి. ఆమె పదవీకాలం దేశంలో నెలకొన్న అస్థిరతకు ముగింపు పలికి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని, దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం చేకూరుస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఆమె నాయకత్వంలో నేపాల్ మళ్లీ సాధారణ పరిస్థితులకు తిరిగి వచ్చి, ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. నేపాల్ రాజకీయ చరిత్రలో సుశీలా కర్కి నాయకత్వం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది అనడంలో సందేహం లేదు.


