Netanyahu advice to Modi on Trump: అగ్రరాజ్యం అమెరికా విధించిన భారీ సుంకాలతో భారత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ, అనూహ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగారు. భారత్‌కు తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో ప్రధాని మోదీకి తానే స్వయంగా సలహాలిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ తనకు మిత్రులేనని చెబుతూ నెతన్యాహు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు ట్రంప్‌తో వ్యవహరించడంలో నెతన్యాహు ఇవ్వబోయే సలహా ఏంటి..? ఈ స్నేహ హస్తం వెనుక ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలు ఏమిటి..? ఈ పరిణామం భారత్-అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది..?
“ట్రంప్‌తో ఎలాగో.. మోదీకి చెబుతా”: భారతీయ జర్నలిస్టుల బృందంతో గురువారం జరిగిన సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధించిన 50% సుంకాల సమస్యను ఎదుర్కోవడంలో భారత్‌కు సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. భారత ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్‌తో వ్యవహరించే విషయంలో మోదీకి కొన్ని సలహాలు ఇస్తాను. అయితే, ఆ సలహాలను బహిరంగంగా కాకుండా వ్యక్తిగతంగానే తెలియజేస్తాను” అని నెతన్యాహు పేర్కొన్నారు. భారత్-అమెరికా ఒక ఉమ్మడి ఒప్పందానికి వచ్చి సుంకాల సమస్యను పరిష్కరించుకోవడం ఇజ్రాయెల్‌కు కూడా ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
READ ALSO:
రక్షణ, నిఘాలోనూ అండగా ఉంటాం: భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారం అత్యంత పటిష్టంగా పురోగమిస్తోందని నెతన్యాహు కొనియాడారు. “ఆపరేషన్ సిందూర్” సమయంలో ఇజ్రాయెల్ ఆయుధాలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని గుర్తుచేశారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ తన నిఘా వ్యవస్థను మరింత మెరుగుపరచుకోవడంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. “ఉగ్రవాదులు దాడి చేయకముందే వారి ప్రణాళికలను పసిగట్టి, తిప్పికొట్టే సామర్థ్యం అవసరం. నిఘా సమాచారంతో పాటు, ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి” అని ఆయన సూచించారు.
త్వరలో భారత పర్యటన.. బెంగళూరుకు నేరుగా విమానం: నెతన్యాహు త్వరలోనే భారత పర్యటనకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా, టెల్ అవీవ్ నుంచి టెక్ హబ్ బెంగళూరుకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడంపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు. దీనివల్ల ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం ఆరు గంటలకు తగ్గుతుందని, ఇది శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం కంటే తక్కువ సమయమని ఆయన అన్నారు.


