Nepal moment in POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్‌లో అసంతృప్తి స్వరం మళ్లీ ఉధృతమవుతోంది. యువత ముఖ్యంగా జనరేషన్ Z పాకిస్తాన్ పరిపాలనను సవాలు చేస్తూ వీధుల్లోకి, సోషల్ మీడియా ఉద్యమానికి దిగుతున్నారు. తమ భూములు, వనరులు, భవిష్యత్తు పాకిస్తాన్ దోచుకుపోతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అక్కడి ప్రజలు “నేపాల్ మూమెంట్”గా పిలుస్తున్నారు. నేపాల్ లో జరిగిన ఉద్యమం నుంచి పీఓకే యూత్ ప్రేరణ పొందినట్లు దీని ద్వారా తెలుస్తోంది.
పాకిస్తాన్ దశాబ్దాలుగా ఈ ప్రాంతంపై సైనిక నియంత్రణతో పాటు ప్రజాస్వామిక హక్కులను అణగదొక్కింది. స్థానికులకు భూమి యాజమాన్యం హక్కు లేకుండా.. వారిని సెకండ్ క్లాస్ పౌరుల్లా వ్యవహరించిందని యువత ఆరోపిస్తోంది. “మా నేల, మా భవిష్యత్తు ఇస్లామాబాద్ లోపలి వర్గాల చేతికి ఇవ్వబడుతోంది” అని ఒక యువనేత మీడియాతో మాట్లాడుతూ బాధ వ్యక్తం చేశాడు.
ధీటైన సమాధానంగా పాకిస్తాన్ ఇప్పుడు పర్యవేక్షణ, నిర్బంధం, భయపెట్టే చర్యలను పెంచుతోంది. అయినా ఆన్‌లైన్ ప్రపంచం కొత్త తరానికి ఆయుధమైంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా ఈ యువత భూదోపిడీ, నీటి వివాదాలు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ప్రపంచానికి సమాచారాన్ని చేరుస్తోంది. #ExposePoK, #GenZStandUp, #NepalMoment వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆన్‌లైన్‌లో వారు ఐక్యంగా పోరాడుతున్నారు.
భారతదేశంపై “నీటి రాజకీయాలు” జరుపుతున్నదని విమర్శిస్తూ తనదైన నీటి వనరులను దోచుకుంటున్న పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని యువత బహిర్గతం చేస్తోంది. మాకేమీ మాట ఇవ్వరని వారు అంటున్నారు. అందుకే మేము మరింత గట్టిగా పోరాడుతున్నామంటూ ఒక విద్యార్థి కార్యకర్త చెప్పాడు.ఈ ఉద్యమం ఇలాగే కొనసాగితే అది నేపాల్‌లో జరిగినట్లే పాకిస్తాన్‌లో అంతర్గత రాజకీయ సంక్షోభానికి దారితీయవచ్చని విశ్లేషకులు అంటున్నారు. యువత చేతిలో ఉన్న సాంకేతిక శక్తి, గ్లోబల్ కనెక్టివిటీ, సామాజిక మాధ్యమాలలో పెరుగుతున్న సంఘీభావం కలిసిరావడంతో ఇస్లామాబాద్ నియంత్రణ వ్యవస్థ చీలిపోతుందని వారు అంటున్నారు.


