Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్USA: షుగర్‌, బీపీ ఉంటే అమెరికాలోకి నో ఎంట్రీ

USA: షుగర్‌, బీపీ ఉంటే అమెరికాలోకి నో ఎంట్రీ

America: అమెరికా (USA)లో స్థిరపడాలని కలలు కనే లక్షలాది మంది వలసదారులకు ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బ. ప్రపంచవ్యాప్తంగా వలసదారులకు స్వర్గధామంగా భావించే అమెరికా, తన పౌరుల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారాన్ని తగ్గించుకునేందుకు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై, వీసా దరఖాస్తుదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటే, వారి దరఖాస్తులు తిరస్కరించబడే ప్రమాదం ఉంది.

- Advertisement -

ఇప్పుడివి ‘వీసా రిస్క్’!
కొత్తగా జారీ చేయబడిన వీసా మార్గదర్శకాల ప్రకారం, వివిధ దేశాలలోని అమెరికా రాయబార కార్యాలయాలు దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని గతంలో కంటే చాలా తీవ్రంగా పరిగణించాలని ఆదేశాలు అందాయి. ముఖ్యంగా ఈ కింది అనారోగ్యాలు ఉన్నవారికి వీసాలు తిరస్కరించబడే అవకాశం ఉంది.

తీవ్రమైన గుండె జబ్బులు (Heart Diseases)

ఊబకాయం (Obesity)

మధుమేహం (Diabetes)

ఊపిరితిత్తుల వ్యాధులు

క్యాన్సర్

న్యూరోపతి (నరాల సమస్యలు)

తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు

గతంలో, చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ఎంబసీ అధికారులు పట్టించుకోకుండా వీసా మంజూరు చేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ కొత్త మార్గదర్శకాలు వీసా అధికారికి దరఖాస్తుదారుడి ఆరోగ్య సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, దరఖాస్తును తిరస్కరించే అధికారాన్ని స్పష్టంగా కల్పిస్తున్నాయి.

అమెరికా ప్రభుత్వం ఈ కఠిన ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణం – ఆర్థిక భారం.అమెరికా పౌరుల కోసం ప్రభుత్వం సబ్సిడీతో కూడిన అనేక ఆరోగ్య బీమా పథకాలను అమలు చేస్తోంది. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న వలసదారులు దేశంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ బీమా పథకాలపై ఆధారపడతారు. దీని వలన, ఆరోగ్య సంరక్షణ వ్యయం భారీగా పెరిగి, చివరకు అమెరికన్ పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఊబకాయం వంటి సమస్యలు కూడా తీవ్రంగా పరిగణించబడతాయి, ఎందుకంటే అవి భవిష్యత్తులో ఆస్తమా, బీపీ వంటి ఇతర వ్యాధులకు దారితీసి, ప్రభుత్వానికి వేల డాలర్ల ఖర్చును పెంచే అవకాశం ఉంది.

పరీక్ష తప్పనిసరి: వీసా దరఖాస్తుదారులు ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలనే నియమం ఇదివరకే ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ మార్గదర్శకాలను అత్యంత కఠినంగా అమలు చేయనున్నారు. హెచ్1బీ (H1B) వీసాలపై ఆంక్షల తర్వాత, అమెరికా ప్రభుత్వం వలసదారులపై విధిస్తున్న తాజా ఆంక్ష ఇది.

వలసదారుల భవిష్యత్తుపై ప్రభావం
సాంకేతిక నిపుణులను, ప్రతిభావంతులను స్వాగతించే అమెరికా, ఇప్పుడు వారి ఆరోగ్యంపై దృష్టి సారించడం వలన, భారతీయ ఐటీ నిపుణులు మరియు ఇతర వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తమ ఆరోగ్య సమస్యలను దాచిపెట్టి వీసా పొందడం ఇకపై దాదాపు అసాధ్యం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad