భారత్ కంటే ముందే ఆ దేశల్లో నూతన సంవత్సరం(New year) వచ్చేసింది. 2025కు అక్కడి ప్రజలు గ్రాండ్ వెల్కమ్ చెప్పేశారు. పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి దీవుల్లోని ప్రజలు అందరికంటే ముందే(3.30గంటలకు) నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన చాతమ్ ఐలాండ్స్(3.45గంటలకు) 2025కు వెల్కమ్ చెప్పారు. ఇక న్యూజిలాండ్ ప్రజలు కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఆ దేశం కొత్త ఏడాదిని స్వాగతించింది. కేరింతలు, బాణసంచా మెరుపుల మధ్య నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకలు అంబరాన్నింటాయి. ఇక రాత్రి 6.30 గంటలకు ఆస్ట్రేలియాలో నూతన సంవత్సరం మొదలుకానుంది.
సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2025లోకి అడుగుపెడతాం. భారత్‌తో పాటు శ్రీలంకలోనూ నూతన సంవత్సరం వస్తుంది. మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాల్లో ఒకేసారి కొత్త ఏడాది వస్తుంది. ఈ దేశాల్లో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. భారత్ తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో న్యూఇయర్ మొదలవుతుంది. ఇక నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం ఉన్నాయి. ఆయా దేశాల క్యాలెండర్ల ప్రకారం అక్కడ న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి.