India-US strategic relations : అగ్రరాజ్యంతో స్నేహం కొన్నిసార్లు కత్తి మీద సాము లాంటిది! వ్యూహాత్మకంగా ఎంత కీలక భాగస్వామి అయినా, వాణిజ్యపరమైన విభేదాలు వస్తే ఆ బంధం పెళుసుగా మారిపోతుంది. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితులు సరిగ్గా ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో, భారత్‌కు మంచి మిత్రురాలిగా పేరున్న రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని ఆమె చెవిలో చెప్పినట్లుగా హితవు పలకడం వెనుక ఆంతర్యమేమిటి…? ఈ ‘చమురు’ చిచ్చును చల్లార్చేందుకు భారత్ ముందున్న మార్గాలేంటి.
ప్రపంచ రాజకీయ యవనికపై భారత్-అమెరికా సంబంధాలు ఎంతో కీలకమైనవి. ముఖ్యంగా చైనాను నిలువరించే వ్యూహంలో ఈ రెండు దేశాల మైత్రికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, రషయా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కో నుంచి భారత్ చౌకగా ముడి చమురును దిగుమతి చేసుకోవడం వాషింగ్టన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై కఠిన ఆంక్షలకు దిగగా, ఇదే అంశంపై రిపబ్లికన్ పార్టీలోనే కీలక నేత అయిన నిక్కీ హేలీ స్పందించారు.
హేలీ హెచ్చరిక.. స్నేహపూర్వక సూచన : భారత్‌ను ఉద్దేశిస్తూ నిక్కీ హేలీ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ పైకి స్నేహపూర్వకంగా కనిపించినా, అందులో ఓ హెచ్చరిక దాగి ఉంది. “రష్యా నుంచి చమురు దిగుమతులపై ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ అత్యంత సీరియస్‌గా తీసుకోవాలి. ఈ సమస్య పరిష్కారానికి వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి” అని ఆమె స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఉన్న ఇరు దేశాల స్నేహబంధం, విశ్వాసం ప్రస్తుత ఒడుదొడుకులను దాటడానికి బలమైన పునాదిగా ఉపయోగపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
చైనా అంశం.. వ్యూహాత్మక అవసరం : నిక్కీ హేలీ తన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. “చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్‌లో మిత్రులు ఉండాలన్న అంశం చాలా ముఖ్యమైనది. దానిని ఏమాత్రం విస్మరించకూడదు” అని ఆమె పేర్కొన్నారు. అంటే, వాణిజ్య విభేదాల కారణంగా చైనా వంటి ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడంలో కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిని దూరం చేసుకోవడం అమెరికాకే నష్టమని ఆమె పరోక్షంగా ట్రంప్ వర్గానికి చురక అంటించారు.
ట్రంప్ కొరడా.. ఆంక్షల పరంపర : మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు భారత్ ఆర్థికంగా సాయం చేస్తోందని ఆరోపిస్తూ, భారత దిగుమతులపై తొలుత 25 శాతం పెనాల్టీలు విధించారు. కొద్ది రోజులకే దానిని 50 శాతానికి పెంచి తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు. అవసరమైతే ద్వితీయ స్థాయి ఆంక్షలు (Secondary Sanctions) కూడా విధిస్తామని, అంటే రష్యాతో వ్యాపారం చేసే భారత కంపెనీలతో లావాదేవీలు జరిపే ఇతర దేశాల సంస్థలపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తొలి విడత సుంకాలు అమల్లోకి రాగా, పెంచిన సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఒబామా వర్సెస్ ట్రంప్.. మారుతున్న దౌత్య నీతి : ట్రంప్ దూకుడు వైఖరిపై అమెరికాలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం భారత్ వంటి మిత్రదేశాన్ని దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒబామా హయాంలో చర్చలు పరస్పర సహకారం, గౌరవంతో జరిగేవని, కానీ ఇప్పుడు ఆదేశాలు, ఒత్తిడితో ‘పెద్దన్న’ పాత్ర పోషించేలా ఉన్నాయని విమర్శించారు. నిజమైన దౌత్యానికి బదులు హెచ్చరికలు జారీ చేయడం సరికాదని పేర్కొన్నారు.


