Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nikki Haley : చైనాతో చెలగాటం వద్దు.. భారత్‌తో బంధమే ముద్దు!

Nikki Haley : చైనాతో చెలగాటం వద్దు.. భారత్‌తో బంధమే ముద్దు!

Nikki Haley on India-US strategic partnership : రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ ఒక కీలకమైన ప్రకటన చేశారు. అమెరికా భద్రతకు చైనా ఒక పెను ముప్పుగా మారిందని ఆమె హెచ్చరించారు. ఈ ముప్పును నివారించడానికి, ఆసియాలో భారత్‌తో కలిసి పని చేయడమే ఉత్తమ మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. అగ్రరాజ్యం అమెరికాకు చైనా రూపంలో పెను ప్రమాదం పొంచి ఉందని, డ్రాగన్‌ను నిలువరించాలంటే ఆసియాలో అండగా నిలిచే ఏకైక శక్తి భారత్ మాత్రమేనని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ స్పష్టం చేశారు. భారత్‌తో పాతికేళ్లుగా నిర్మించుకున్న బలమైన బంధాన్ని బలహీనపరుచుకోవడం చారిత్రక తప్పిదమే కాకుండా, ఒక “వ్యూహాత్మక విపత్తు” అని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. కమ్యూనిస్టు చైనాకు, ప్రజాస్వామ్య భారత్‌కు మధ్య ఉన్న తేడాను గుర్తించడంలో విఫలమైతే భారీ మూల్యం తప్పదని సూచించారు. ఇంతకీ నిక్కీ హేలీ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..? 

- Advertisement -

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘న్యూస్ వీక్’కు రాసిన ప్రత్యేక వ్యాసంలో నిక్కీ హేలీ, మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అమెరికా అనుసరించాల్సిన విదేశాంగ విధానంపై తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వెల్లడించారు. 

భారత్ అండ లేకపోతే కష్టమే: ఆసియా ఖండంలో చైనా ఆధిపత్యానికి, విస్తరణవాద కాంక్షకు సవాల్ విసరగల ఏకైక ప్రజాస్వామ్య శక్తి భారత్ మాత్రమే. ఆర్థికంగా, సైనికంగా బలపడుతున్న భారత్ ఎదుగుదల స్వేచ్ఛాయుత ప్రపంచానికి మేలు చేస్తుందే తప్ప, కమ్యూనిస్టు నియంతృత్వ చైనాకు మాత్రమే ముప్పు కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికా ఈ నిజాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని హితవు పలికారు.

వ్యూహాత్మక విపత్తును నివారించాలి: గత 25 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులు ఎంతో ముందుచూపుతో భారత్‌తో పటిష్టమైన సంబంధాలను నిర్మించారు. ఈ బంధాన్ని నీరుగార్చడం అంటే చేజేతులా వ్యూహాత్మక విపత్తును కొనితెచ్చుకోవడమేనని నిక్కీ హేలీ హెచ్చరించారు. భారత్-చైనా ఇరుగుపొరుగు దేశాలైనందున వాటి మధ్య బలమైన బంధం ఏర్పడటం చాలా సులభమని, ఆ పరిస్థితి రాకముందే అమెరికా మేల్కోవాలని సూచించారు.

చైనాకు ప్రత్యామ్నాయం భారతే: అమెరికాకు అవసరమైన వస్త్రాలు, చౌక స్మార్ట్‌ఫోన్లు, సోలార్ ప్యానళ్ల వంటి కీలక ఉత్పత్తుల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. ఈ ఉత్పత్తులను అదే స్థాయిలో తయారు చేయగల సత్తా భారత్‌కు ఉందని, తయారీ రంగంలో భారత్‌ను ప్రోత్సహించడం ద్వారా చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టవచ్చని ఆమె ఒక మార్గాన్ని సూచించారు.

రక్షణ, వాణిజ్య మార్గాల్లో కీలక పాత్ర: పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడంలో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తుందని, దాని రక్షణ సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయని నిక్కీ హేలీ గుర్తు చేశారు. వాణిజ్యం, ఇంధన సరఫరా కోసం చైనా ఉపయోగించే కీలక సముద్ర మార్గాలన్నీ భారత్‌కు సమీపంలోనే ఉన్నాయి. భవిష్యత్తులో సైనిక ఘర్షణలు తలెత్తితే, ఈ వ్యూహాత్మక ప్రాంతం అమెరికాకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె విశ్లేషించారు.

ట్రంప్‌కు సూటి సలహాలు: సుంకాల పెంపుతో భారత్‌పై ఒత్తిడి పెంచాలనే ఆలోచనను అధ్యక్షుడు ట్రంప్ విరమించుకోవాలని ఆమె సూచించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి వంటి సున్నితమైన విషయాలపై పరిష్కారం కనుగొనేందుకు, అవసరమైతే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపాలని హితవు పలికారు. చైనా, ఇజ్రాయెల్‌లతో సంబంధాలకు ఇచ్చినట్టే ప్రాధాన్యాన్ని భారత్‌కు కూడా ఇవ్వాలని, ఇందుకోసం మరిన్ని వనరులను కేటాయించాలని ఆమె స్పష్టం చేశారు.

భారత్ ఎదుగుదలే చైనాకు విరుగుడు: ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న చైనా ఆశయాలకు, భారత్ ప్రగతి గండి కొడుతుందని నిక్కీ హేలీ పేర్కొన్నారు. 2020 గల్వాన్ ఘర్షణను ఉదహరిస్తూ, అమెరికాతో స్నేహం కొనసాగిస్తే, భవిష్యత్తులో చైనాను ఆర్థికంగా, సైనికంగా ఎదుర్కొనేందుకు భారత్‌కు మరింత చేయూత లభిస్తుందని ఆమె విశ్లేషించారు. భారత్‌తో వాణిజ్య యుద్ధానికి దిగాలనే ఆలోచన పెద్ద తప్పిదమని, దీనిని అదునుగా చేసుకుని చైనా లబ్ధి పొందుతుందని ఆమె హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad