Nobel Peace Prize 2025: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ఎవరికి అనే అంశంపై ఉత్కంఠ వీడింది. 2025కి గాను నోబెల్ పీస్ ప్రైజ్ మరియా కొరీనా మచోడాను వరించింది. ఈ విషయాన్ని అధికారికంగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రజల హక్కుల కోసం పోరాడినందుకు గాను వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా మచోడా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

Also Read: https://teluguprabha.net/international-news/us-presidents-who-won-nobel-peace-prize/
ఇప్పటివరకూ నోబెల్ శాంతి బహుమతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొన్ని గంటల క్రితం ట్రంప్‌నకు రష్యా మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన వల్లే ప్రపంచంలోని పలు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగాయని ట్రంప్ స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో అత్యున్నత నోబెల్ శాంతి బహుమతి మరియాను వరించడం ట్రంప్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తుందనే చెప్పవచ్చు. కాగా, గతేడాది జపాన్‌కు చెందిన నిహాన్ హిండాక్యో సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. హిరోషిమా, నాగసాకిల్లో అణుబాంబు దాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడింది.
కాగా, ఈ ఏడాది మొత్తం 338 మంది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. అయితే వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు గాను అకాడమీ సభ్యులు మరియా కొరీనా వైపు మొగ్గు చూపారు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారు. ప్రస్తుతం మరియా వెనెజువెలా పార్లమెంట్ సభ్యురాలిగా, విపక్షనేతగా పనిచేస్తున్నారు.


