History of the Nobel Prize : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం నోబెల్ బహుమతి ప్రకటనలకు సమయం ఆసన్నమైంది. వైద్యం నుంచి సాహిత్యం వరకు, శాంతి నుంచి ఆర్థిక శాస్త్రం వరకు.. మానవాళి మేధస్సుకు, సేవకు పట్టం కట్టే ఈ పురస్కారాల కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు ఈ బహుమతి ఎలా పుట్టింది..? విధ్వంసానికి కారణమైన డైనమైట్‌ను కనిపెట్టిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌కు శాంతి బహుమతిని స్థాపించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది..? ఆయనకు అంతటి అపార సంపద ఎలా సమకూరింది? విజేతలను ఎలా ఎంపిక చేస్తారు..?
ప్రతి ఏటా ప్రపంచం దృష్టిని ఆకర్షించే నోబెల్ బహుమతుల వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర, ఓ శాస్త్రవేత్త సమున్నత ఆశయం దాగి ఉన్నాయి. విధ్వంసకారిగా పేరుపొందిన ‘డైనమైట్’ ఆవిష్కర్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ తన సంపదను మానవ శ్రేయస్సు కోసం అంకితం చేయాలన్న తపనతోనే ఈ పురస్కారాలకు అంకురార్పణ చేశారు.
ఆల్‌ఫ్రెడ్ నోబెల్ – డైనమైట్ సృష్టికర్త : స్వీడన్‌కు చెందిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ (1833-1896) ఒక రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన తన జీవితకాలంలో ‘డైనమైట్’ అనే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థంతో సహా 355 ఆవిష్కరణలపై పేటెంట్లు పొందారు. ఈ పేటెంట్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు విక్రయించడం ద్వారా ఆయన అపారమైన సంపదను కూడబెట్టారు. ఆ సంపదను చమురు, మైనింగ్, ఆయుధ తయారీ కంపెనీలలో పెట్టుబడులుగా పెట్టి మరింతగా వృద్ధి చేశారు.
ఓ వీలునామాతో విశ్వఖ్యాతి : అయితే, తన ఆవిష్కరణలు మానవ వినాశనానికి దారితీస్తున్నాయన్న పశ్చాత్తాపం ఆయనలో ఉండేదని చెబుతారు. ఈ క్రమంలో, తాను చనిపోవడానికి ఏడాది ముందు, 1895లో, ఒక చారిత్రాత్మక వీలునామా రాశారు. తన యావదాస్తిని ఓ ఫౌండేషన్ కిందకు తెచ్చి, దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రతి ఏటా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి రంగాలలో మానవాళికి విశేష సేవ చేసిన వారికి బహుమతులు ప్రదానం చేయాలని అందులో పేర్కొన్నారు.
నోబెల్ ఫౌండేషన్ – తరగని సంపద : ఆయన వీలునామా ప్రకారం, 1900 జూన్ 29న ‘నోబెల్ ఫౌండేషన్’ ఏర్పాటైంది. ఆ సమయంలో ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 29.34 కోట్లు. ఫౌండేషన్ ఆ సంపదను సమర్థవంతంగా నిర్వహించడంతో, 2024 నాటికి దాని విలువ ఏకంగా రూ. 2,300 కోట్లకు పెరిగింది. ఈ ఆదాయంతోనే గత 125 ఏళ్లుగా నిరంతరాయంగా బహుమతులను ప్రదానం చేస్తున్నారు. తొలిసారిగా 1901లో పురస్కారాలను అందించారు. 1968లో స్వీడన్ సెంట్రల్ బ్యాంకు సిఫారసు మేరకు ఆర్థిక శాస్త్రాన్ని ఈ జాబితాలో చేర్చారు.
విజేతల ఎంపిక.. అత్యంత రహస్యం : నోబెల్ విజేతల ఎంపిక ప్రక్రియ అత్యంత పకడ్బందీగా, గోప్యంగా సాగుతుంది. ప్రతి విభాగానికి నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీలు ఉంటాయి. ఏ వ్యక్తి కూడా సొంతంగా నామినేట్ చేసుకోలేడు. అర్హులైన వారి పేర్లను ఇతరులు (ప్రొఫెసర్లు, గత నోబెల్ గ్రహీతలు, పార్లమెంట్ సభ్యులు మొదలైనవారు) ప్రతిపాదించాలి.
నామినేట్ అయిన వారి పేర్లను కమిటీలు 50 ఏళ్ల పాటు బయటకు వెల్లడించవు. ఇది అత్యంత కఠినమైన నిబంధన.
వివిధ కమిటీలు అందిన నామినేషన్లను కూలంకషంగా పరిశీలించి, మానవాళికి అత్యంత ప్రయోజనం చేకూర్చిన ఆవిష్కరణలు లేదా సేవలకు పెద్దపీట వేసి విజేతలను ఎంపిక చేస్తాయి.
ప్రదానోత్సవంలోనూ ఓ ప్రత్యేకత : నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేయగా, మిగిలిన అన్ని బహుమతులను ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్వస్థలమైన స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో అందజేస్తారు. ప్రతి ఏటా ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. విజేతలకు సుమారు రూ. 10 కోట్ల నగదు, 18 క్యారెట్ల బంగారు పతకం, ఒక డిప్లొమాను బహూకరిస్తారు.
2025 నోబెల్ ప్రకటనల షెడ్యూల్:
వైద్యశాస్త్రం: అక్టోబర్ 6
భౌతిక శాస్త్రం: అక్టోబర్ 7
రసాయన శాస్త్రం: అక్టోబర్ 8
సాహిత్యం: అక్టోబర్ 9
శాంతి బహుమతి: అక్టోబర్ 10
ఆర్థిక శాస్త్రం: అక్టోబర్ 13


