Nobel Winner Machado Dedicates Prize to Trump: 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తర్వాత శుక్రవారం రాత్రి ఊహించని రాజకీయ డ్రామా చోటుచేసుకుంది. ఈ ఏడాది పురస్కార గ్రహీత, వెనిజులా విపక్ష నేత మరియా కొరినా మచాడో, తనకు లభించిన ప్రతిష్టాత్మక అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మరోవైపు, ఈ బహుమతి కోసం తీవ్రంగా ప్రచారం చేసుకుని భంగపడిన ట్రంప్ కార్యాలయం, నోబెల్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
“ఈ బహుమతిని నేను వెనిజులాలోని బాధిత ప్రజలకు, మా ప్రజాస్వామ్య ఉద్యమానికి గట్టి మద్దతునిచ్చిన అధ్యక్షుడు ట్రంప్‌కు అంకితం చేస్తున్నాను!” అని మచాడో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “మేము విజయానికి అడుగు దూరంలో ఉన్నాం. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం సాధించడానికి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా దేశాలు మాకు మిత్రులుగా నిలవాలి” అని ఆమె కోరారు. వెనిజులా అధ్యక్షుడు మదురోపై ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరికి, సైనిక ఒత్తిడికి మచాడో గతంలో మద్దతు పలికిన విషయం తెలిసిందే.
ALSO READ: Nobel Prize: నోబెల్ బహుమతిలో అసలు ఏముంటుంది.. ఇంట్రెస్టింగ్ విషయాలు.!!
తీవ్రంగా స్పందించిన వైట్ హౌస్
మచాడో ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే, నోబెల్ పురస్కారం దక్కనందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న వైట్ హౌస్ ఘాటుగా స్పందించింది. “నోబెల్ కమిటీ మరోసారి శాంతి కంటే రాజకీయాలకే పెద్దపీట వేస్తుందని నిరూపించుకుంది,” అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చుంగ్ అన్నారు. “అయినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేయడం, యుద్ధాలను ఆపడం, ప్రాణాలను కాపాడటం కొనసాగిస్తారు. ఆయన సంకల్ప బలంతో పర్వతాలను కదిలించగలరు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్‌ను ఎందుకు విస్మరించారు?
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఉద్రిక్తతలను చల్లార్చానని, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పుకున్నారు. అయితే, భారత్ వంటి దేశాలు ట్రంప్ వాదనలను తీవ్రంగా ఖండించాయి.
ట్రంప్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు నోబెల్ కమిటీ చైర్ జోర్జెన్ వాట్నే ఫ్రైడ్నెస్ పరోక్షంగా సమాధానమిచ్చారు. “మా కమిటీ గది గత పురస్కార గ్రహీతల చిత్రపటాలతో నిండి ఉంటుంది. ఆ గది మొత్తం వారి ధైర్యం, నిజాయితీలతో నిండి ఉంటుంది. మేము ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం, బయటి ప్రచారాలను పట్టించుకోం,” అని ఆయన స్పష్టం చేశారు. మచాడోను “ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసే కీలక వ్యక్తి” అని అభివర్ణించడం ద్వారా, విభజన రాజకీయాలు చేసే ట్రంప్‌కు తాము ఎందుకు వ్యతిరేకమో కమిటీ సూచనప్రాయంగా తెలిపింది.
మొత్తంమీద, ఒక ధైర్యశాలికి దక్కిన పురస్కారం, ఆమె దానిని ఓ శక్తివంతమైన నేతకు అంకితం ఇవ్వడం, ఆ నేత కార్యాలయం కమిటీపై విరుచుకుపడటంతో ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Nobel Peace Prize: నిరంకుశత్వంపై అలుపెరుగని పోరు.. 14 నెలలుగా అజ్ఞాతవాసం.. వెనిజులా ‘ఐరన్ లేడీ’ కథ


