Saturday, February 14, 2026
Homeఇంటర్నేషనల్Norway Royal Scandal: రాజమాత సుపుత్రుడు.. నేరాల చిట్టా! కోర్టు మెట్లెక్కిన నార్వే యువరాజు...

Norway Royal Scandal: రాజమాత సుపుత్రుడు.. నేరాల చిట్టా! కోర్టు మెట్లెక్కిన నార్వే యువరాజు సవతి కొడుకు

Marius Borg Hoiby trial : రాజప్రాసాదంలో ఉండాల్సిన వాడు కోర్టు బోనులో నిలబడ్డాడు.. గౌరవ మర్యాదలతో బతకాల్సిన వాడు గంజాయి కేసుల్లో ఇరుక్కున్నాడు. ప్రశాంతతకు మారుపేరైన నార్వేలో ఇప్పుడు రాజకుటుంబం చుట్టూ ముసురుకున్న ఈ వివాదం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. నార్వే యువరాణి మెట్టె-మారిత్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీపై ఏకంగా అత్యాచారం, హింస వంటి తీవ్రమైన ఆరోపణలు రావడం, మంగళవారం  నుంచి విచారణ ప్రారంభం కావడం కలకలం రేపుతోంది. ఒకవైపు కన్నకొడుకు జైలు భయం.. మరోవైపు పాత స్నేహాలు తెచ్చిన తలనొప్పులు.. రాజకుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు యువరాణి కొడుకుపై నమోదైన ఆ 38 అభియోగాలు ఏంటి? కోర్టులో ఆయన ఏం చెప్పారు? ఈ కేసు ఎందుకింత జఠిలంగా మారింది?

- Advertisement -

38 అభియోగాలు – నివ్వెరపోయే నిజాలు : నార్వే యువరాణి మెట్టె-మారిత్ మాజీ సంబంధం ద్వారా జన్మించిన కుమారుడు, ప్రస్తుత యువరాజు హాకాన్  సవతి కొడుకైన 29 ఏళ్ల మారియస్ బోర్గ్ హోయిబీ  ఓస్లో జిల్లా కోర్టులో హాజరయ్యారు. ప్రాసిక్యూటర్ స్టర్లా హెన్రిక్స్‌బో ఆయనపై ఏకంగా 38 అభియోగాలను చదివి వినిపించారు.

తీవ్ర ఆరోపణలు: ఇందులో నాలుగు అత్యాచార  కేసులు, మాజీ ప్రేయసిపై గృహ హింస, మరో మహిళపై దాడి, చంపేస్తానని బెదిరింపులు వంటివి ఉన్నాయి. వీటిని హోయిబీ ఖండించారు. “నేను నిర్దోషిని ” అని న్యాయమూర్తికి తెలిపారు. అయితే, 3.5 కిలోల గంజాయి రవాణా చేయడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, నిషేధాజ్ఞలు  ధిక్కరించడం వంటి అభియోగాలను ఆయన అంగీకరించడం గమనార్హం.

చట్టం ముందు అందరూ సమానమే : విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “నిందితుడు యువరాణి కుమారుడు కావచ్చు, రాజకుటుంబ సభ్యుడు కావచ్చు.. కానీ చట్టం ముందు అందరూ సమానమే. సామాన్యులను ఎలా విచారిస్తామో, ఆయన్ను కూడా అలాగే చూస్తాం” అని ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. నేరం రుజువైతే హోయిబీకి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విచారణ మార్చి 19 వరకు కొనసాగనుంది.

సునామీలా చుట్టుముట్టిన వివాదాలు : హోయిబీ తరఫు న్యాయవాది ఎలెన్ హోలేగర్ వాదనలు వినిపిస్తూ.. మీడియా ప్రచారం తన క్లయింట్ జీవితాన్ని అతలాకుతలం చేసిందని పేర్కొన్నారు. “వేలకొద్దీ వార్తా కథనాలు ఒక సునామీలా  విరుచుకుపడ్డాయి. తన జీవితం తన చేజారిపోతోందన్న ఆవేదనలో ఆయన ఉన్నారు. కానీ తీర్పు చెప్పాల్సింది కోర్టు మాత్రమే, మీడియా కాదు” అని ఆమె వాదించారు. మరోవైపు, బాధితుల్లో ఒకరైన మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ పేరు బయటకు వస్తుందేమోనని భయపడుతున్నారని, మీడియా ఒత్తిడి ఆమెపై తీవ్రంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్ లింక్ – యువరాణికి కొత్త తలనొప్పి : ఇదే సమయంలో యువరాణి మెట్టె-మారిత్ గతంలో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు నెరిపారన్న పాత గాయం మళ్లీ రేగింది. జనవరి 30న విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్ ద్వారా.. 2013లో ఫ్లోరిడాలోని ఎప్‌స్టీన్ ప్రాపర్టీలో యువరాణి బస చేసినట్లు తేలింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. “ఎప్‌స్టీన్ నేరచరిత్ర తెలియక తప్పు చేశాను. ఇది సిగ్గుచేటు” అని విచారం వ్యక్తం చేశారు. కొడుకు కేసు, తల్లి పాత స్నేహాలు వెరసి.. నార్వే రాజకుటుంబం ప్రతిష్టకు  తీవ్ర భంగం వాటిల్లుతోంది. యువరాజు హాకాన్, యువరాణి మెట్టె-మారిత్ విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాజప్రాసాదం ఈ వ్యవహారంపై మౌనం పాటిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News