Nuclear Watchdog Shut Out : ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రపంచం దృష్టి సారించింది. అణు తనిఖీలను నిలిపివేస్తూ ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఇరాన్ నాయకత్వం ఈ సాహసోపేతమైన చర్యను ఎందుకు చేపట్టింది, దాని పరిణామాలు ఏమిటి..?
ఇరాన్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం : జూలై 2, 2025న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజష్కియాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)కు సహకారం నిలిపివేసే చట్టానికి ఆయన ఆమోదం తెలిపారు. అంతకు వారం రోజుల ముందే, అంటే జూన్ 25న ఇరాన్ పార్లమెంట్ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ చట్టం ప్రకారం, ఇరాన్‌లోని అణు కేంద్రాలను తనిఖీ చేయడానికి ఐఏఈఏకు ఇకపై అనుమతి లేదు. తమ అణు కార్యక్రమంపై అమెరికా-ఇజ్రాయెల్ నిరంతరం దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నందున, వాటికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది.
అణు హక్కుల పరిరక్షణ : ఇరాన్ వార్తా సంస్థల కథనం ప్రకారం, ఈ నిర్ణయం కేవలం ఒక ప్రతిస్పందన మాత్రమే కాదు, ఇరాన్ తన స్వావలంబనను కాపాడేందుకు, తమ అణు హక్కులను పరిరక్షించుకునేందుకు తీసుకున్న కీలక చర్య.
ఇజ్రాయెల్ దాడులకు ముందే, ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ ఇరాన్‌పై వ్యతిరేక తీర్మానాన్ని సమర్థించడం, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ప్రతిపాదనలు, అమెరికా మద్దతు ఇరాన్‌ను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కొత్త అణు కేంద్రం నిర్మాణం, సెంట్రిఫ్యూజ్ అప్‌గ్రేడ్‌లపై ఆలోచనలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనా, లేక అణు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనుందా అనేది ప్రస్తుతానికి ప్రశ్నగా మిగిలిపోతోంది.
పరిమితులు- షరతులతో కూడిన ప్రవేశం : ఈ కొత్త చట్టం ప్రకారం, ఇరాన్ అణు సౌకర్యాల భద్రతను నిర్ధారించే వరకు, శాంతియుత అణు కార్యకలాపాలకు హామీ ఇచ్చే వరకు ఐఏఈఏ పరిశీలకులకు ప్రవేశం లేదు. ఈ నిర్ణయం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆమోదంపై ఆధారపడుతుంది. అంటే, ఇరాన్ భద్రతా మండలి అనుమతి లేకుండా ఐఏఈఏ ఇకపై ఇరాన్ అణు కేంద్రాల్లో కాలు మోపలేదు.
నష్టాల అంచనా – దెబ్బతిన్న అణు కేంద్రాలు: ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నట్లుగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎంత నష్టం జరిగిందో కచ్చితంగా చెప్పలేమని, ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ దానిని అంచనా వేస్తోందని ఆయన తెలిపారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఫోర్డో కేంద్రంలో తవ్వకాలు పునరాగమనం జరుగుతోంది. ఉపగ్రహ చిత్రాలు వాహనాలు, తవ్వక యంత్రాలు, క్రేన్‌లతో కొత్త మార్గం ఏర్పాటుకు సూచిస్తున్నాయి. ఇది దెబ్బతిన్న కేంద్రాలను పునరుద్ధరించే ప్రయత్నమా, లేక కొత్త అణు కేంద్రాల నిర్మాణం దిశగా ఇరాన్ అడుగులు వేస్తోందా అనేది ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ శాంతికి, స్థిరత్వానికి ముప్పుగా మారే అవకాశం ఉంది.