Pakistan Navy’s strategic retreat : మాటలతో కోటలు కట్టడం, చేతల్లో మాత్రం తోక ముడవడం పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. పహల్గాంలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పాల్పడిన పాక్‌కు.. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో గట్టిగా బుద్ధి చెప్పింది. అయితే, ఈ ఆపరేషన్ దెబ్బకు దాయాది దేశం ఎంతగా భయపడిందంటే, తమ యుద్ధ నౌకలను సైతం రేవులో ఉంచడానికి సాహసించలేదు. భారత క్షిపణులకు భయపడి వాటిని రహస్య ప్రాంతాలకు తరలించింది. ఈ సంచలన నిజాలను తాజాగా బయటపడిన ఉపగ్రహ చిత్రాలు కళ్లకు కట్టాయి. అసలు ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం జరిగింది..? పాక్ నౌకలు ఎందుకు కరాచీ నుంచి మాయమయ్యాయి..? ఆ ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టిన అసలు నిజాలేంటి..?
ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయి : భారత ‘ఆపరేషన్ సిందూర్’ ఉద్ధృతంగా కొనసాగుతున్న సమయంలో, పాకిస్థాన్ నౌకాదళం అప్రమత్తమైంది. తమ ప్రధాన నౌకా స్థావరమైన కరాచీ పోర్టుపై భారత్ దాడి చేయవచ్చని బలంగా అనుమానించింది. ఈ క్రమంలోనే, 2025 మే 8వ తేదీన తీసిన ఉపగ్రహ చిత్రాలలో కరాచీ నౌకాశ్రయం దాదాపు ఖాళీగా కనిపించింది. వాస్తవానికి అక్కడ ఉండాల్సిన కీలక యుద్ధ నౌకలు ఏవీ ఆ చిత్రాల్లో లేవు.
కానీ, సరిగ్గా రెండు రోజుల తర్వాత, మే 10వ తేదీన తీసిన చిత్రాలలో, కరాచీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వదార్ పోర్టు వద్ద ఏకంగా 7 పాకిస్థాన్ యుద్ధ నౌకలు లంగరేసి కనిపించాయి. మరికొన్ని నౌకలను వాణిజ్య టెర్మినళ్లలో దాచిపెట్టగా, ఇంకొన్నింటిని ఇరాన్ సరిహద్దుల వైపు తరలించినట్లు స్పష్టమైంది. అంటే, భారత దాడి భయంతో పాక్ నేవీ తమ నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందన్నమాట.
చైనా నౌకలైనా.. భయం తప్పలేదు : ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గ్వదార్‌లో కనిపించిన నౌకల్లో చైనాలో తయారైన అత్యాధునిక జుల్ఫికర్ శ్రేణి ఫ్రిగెట్లు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌కు కేవలం ఆరు నెలల ముందే పాకిస్థాన్ ఈ నౌకలను చైనా నుంచి కొనుగోలు చేసింది. వాటి ప్రారంభోత్సవం సందర్భంగా యాంటీ-షిప్ క్షిపణులను ప్రయోగించి, తమ శక్తిని ప్రదర్శిస్తూ వీడియోలను కూడా విడుదల చేసింది. కానీ, భారత్‌తో అసలు సిసలైన ఘర్షణ మొదలయ్యేసరికి, ఆ చైనా నౌకలనే ముందుగా తీసుకెళ్లి దాచిపెట్టింది. దీన్ని బట్టే అర్థమవుతోంది, భారత నావికాదళం సత్తా ఏంటో పాకిస్థాన్‌కు బాగా తెలుసని.
గతం గుర్తుకొచ్చిందా..? ‘ఆపరేషన్ పైథాన్’ భయమా..?
పాకిస్థాన్ ఈ రకంగా భయపడటానికి బలమైన చారిత్రక కారణం ఉంది. 1971 యుద్ధ సమయంలో భారత నౌకాదళం ‘ఆపరేషన్ పైథాన్’ పేరుతో కరాచీ నౌకాశ్రయాన్ని టార్గెట్ చేసింది. ఆ దాడిలో పాక్‌కు చెందిన ఫ్లీట్ ట్యాంకర్, అనేక చమురు డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాణిజ్య నౌకలు సైతం సముద్రంలో మునిగిపోయాయి. మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందనే భయంతోనే, పాక్ నేవీ ముందుజాగ్రత్త చర్యగా తమ యుద్ధ నౌకలను తరలించిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మాటలు ఎక్కువ.. విషయం తక్కువ :ఒకవైపు సైన్యం ఇలా ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే, మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ మాత్రం “వీర మరణమే నా ఆకాంక్ష” అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ, మే 10న నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడులు చేసినప్పుడు, ఇదే మునీర్ గంటల తరబడి ఒక రహస్య బంకర్‌లో దాక్కున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో నెటిజన్లు ఆయన మాటలను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ధాటికి తట్టుకోలేక, చివరికి పాకిస్థాన్ సంధికి వచ్చింది. కానీ, సిగ్గులేకుండా యుద్ధంలో తామే గెలిచామంటూ ఇప్పుడు ప్రపంచం ముందు గొప్పలు చెప్పుకుంటూ నవ్వులపాలవుతోంది.


