Minneapolis shooting: అమెరికాలోని మిన్నియాపాలిస్‌లో చోటుచేసుకున్న ఒక దురదృష్టకర ఘటన ఇప్పుడు ఆ దేశంలో పెను సంచలనంగా మారింది. అమెరికా వలసల నియంత్రణ విభాగం(ICE) ఏజెంట్ జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల అమెరికన్ పౌరురాలు రెనీ నికోల్ గుడ్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన భారీ వలస నిరోధక ఆపరేషన్‌లో భాగంగా ఈ ఘటన జరగడం గమనార్హం.
ఈ వివాదానికి ప్రధాన కారణం ఫెడరల్ అధికారులు, స్థానిక నాయకుల మధ్య ఉన్న భిన్నమైన వాదనలు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ఘటనను ‘దేశీయ ఉగ్రవాదం’గా అభివర్ణించింది. సదరు మహిళ తన కారుతో అధికారులను తొక్కించే ప్రయత్నం చేసిందని, ఆత్మరక్షణ కోసమే ఏజెంట్ కాల్పులు జరిపారని అధికారులు వాదిస్తున్నారు. అయితే మిన్నియాపాలిస్ మేయర్ జేక్ ఫ్రే ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. “అదంతా అబద్ధం, కేవలం ఆత్మరక్షణ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు. ఆమె కేవలం అక్కడి పరిస్థితులను గమనిస్తున్న వ్యక్తి మాత్రమేనని.. అధికారులను చంపే ఉద్దేశం ఆమెకు లేదని స్థానిక నేతలు చెబుతున్నారు.
also read FOREX : డాలర్ జోరు.. రూపాయి బేజారు! 90కి చేరువలో మారకం విలువ!
ఈ కాల్పుల ఘటనతో మిన్నియాపాలిస్ అట్టుడుకుతోంది. సంఘటనా స్థలంలో వందలాది మంది ప్రజలు నిరసనలకు దిగారు. “ICE నగరం వదిలి వెళ్లాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనకారులు ఈ కాల్పులను ‘హత్య’గా అభివర్ణిస్తూ.. ఫెడరల్ ఏజెంట్ల అరాచకాలను నిరసించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిన్నియాపాలిస్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. నేషనల్ గార్డ్‌ను అప్రమత్తం చేశారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన ప్రదేశానికి కేవలం ఒక మైలు దూరంలోనే ఈ ఘటన జరగడం ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.
ప్రస్తుతం ఈ కేసుపై ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఒకవైపు ఫెడరల్ ప్రభుత్వం ఈ ఆపరేషన్లను కొనసాగిస్తామని చెబుతుండగా.. మరోవైపు స్థానిక మేయర్, గవర్నర్ టిమ్ వాల్జ్ మాత్రం ఫెడరల్ బలగాలు తమ నగరాన్ని వదిలి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం అమెరికాలో వలసల విధానంతో పాటు పోలీసుల అధికారాల పరిమితులపై మరోసారి చర్చకు దారితీసింది. దీంతో ట్రంప్ ప్రభుత్వంపై కూడా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

