జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల్లో భాగంగా మే 9వ తేదీ శుక్రవారం రాత్రి పాకిస్థాన్ మరోసారి భారతదేశంపై దాడికి యత్నించింది. పలు నగరాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిని భారత భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. అనంతరం, భారత్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై దాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేసింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ అధ్యక్షుడు నజామ్ సేథి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నజామ్ సేథి, పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. మన దేశం తీవ్రంగా బలహీనపడింది. దేశీయంగా రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా మద్దతు లేక, పక్కనున్న ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో కూడా అనుబంధాలు బలహీనంగా మారాయి. అమెరికా సహకారం దాదాపుగా ఆగిపోయిందని తెలిపారు.
యాంకర్ మాత్రం ఇదే సందర్భంలో భారతదేశ పరిస్థితిని ప్రస్తావిస్తూ “భారతదేశం అంతర్గతంగా అస్థిరంగా ఉంది. బంగ్లాదేశ్‌తోనూ విభేదాలున్నాయి” అని వ్యాఖ్యానించింది. దీనిపై నజామ్ సేథి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. ఇది పూర్తిగా అపోహ భారత్ గ్లోబల్ ప్లేయర్‌గా ఎదిగింది. విదేశీ పెట్టుబడులు, అరబ్ దేశాల మద్దతు అన్ని భారత్ వైపే ఉన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఇప్పటికే బిలియన్ల డాలర్ల ఒప్పందాలు భారత్‌తో కుదుర్చుకున్నాయి. భారత్ ఒంటరిగా లేదు. అంతర్జాతీయంగా దానికి గుర్తింపు ఉంది. కానీ మనం ఇప్పుడు పూర్తిగా మారామని తెలిపారు. మన దేశానికి గౌరవం తగ్గిపోయింది. బంగ్లాదేశ్‌ను పోల్చడం కూడా దారుణం అన్నారు.
ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి నేతల వైఫల్యం, మార్గదర్శన లోపమే కారణమని నజామ్ సేథి అభిప్రాయపడ్డారు. భారత్ ప్రతీకార చర్యలు, పాకిస్థాన్‌లోని వైఫల్యాలు ఇప్పుడు ప్రపంచ మద్దతును ఎటు మళ్లిస్తున్నాయన్నదానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.