Pakistan-Afghanistan border conflict : ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే, మరోవైపు తుపాకులు గర్జిస్తున్నాయి. చర్చల ప్రక్రియ నడుస్తుండగానే, పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో నెత్తురు పారుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా జరిగిన భీకర ఘర్షణల్లో పాక్ సైన్యం 25 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా, ఐదుగురు సైనికులను కోల్పోయింది. అసలు శాంతి చర్చలు జరుగుతుండగా ఈ భీకర ఘర్షణలకు దారితీసిన పరిస్థితులేంటి? ఈ నెత్తుటి క్రీడ వెనుక ఉన్నదెవరు? హతమైంది కేవలం ఉగ్రవాదులేనా, లేక ఇందులో తాలిబన్ల హస్తం కూడా ఉందా..? ఈ పరిణామాలు ఇరు దేశాల సంబంధాలను ఎటువైపు నడిపించనున్నాయి?
చర్చల నడుమ చొరబాటు యత్నం : ఖతార్, తుర్కియేల మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు సమీపంలోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్ జిల్లాల వద్ద సరిహద్దు దాటి పాక్‌లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ చొరబాటును పసిగట్టిన పాక్ సైన్యం వెంటనే ప్రతిదాడులకు దిగింది. ఈ భీకర పోరులో నలుగురు ఆత్మాహుతి బాంబర్లతో సహా మొత్తం 25 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు పాక్ సైనిక వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. అయితే, ఈ భీకర పోరులో ఐదుగురు పాక్ సైనికులు కూడా వీరమరణం పొందారు. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం వెల్లడించింది. అయితే, హతమైన వారు తెహ్రీక్ ఏ తాలిబాన్ (టీటీపీ) ఉగ్రవాదులా లేక అఫ్గాన్ తాలిబన్ దళాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ దాడులపై అఫ్గానిస్థాన్ ఇంకా స్పందించలేదు.
విఫలమవుతున్న శాంతి యత్నాలు : ఉగ్రవాద నిర్మూలనపై అఫ్గాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కేవలం నీటి మూటలేనని ఈ తాజా ఘటన రుజువు చేస్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. శాంతి చర్చలపై ఒప్పందం కుదరకపోతే అఫ్గాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం తప్పదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరోవైపు, ఈ వివాదాన్ని తాను త్వరలోనే పరిష్కరిస్తానని మలేసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
సామాన్యుడిపై ధరల భారం : గత మూడు నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. టీటీపీ ఉగ్రవాదులే లక్ష్యంగా పాక్ సైన్యం కాబూల్‌పై వైమానిక దాడులు చేయడంతో అక్టోబరు 11 నుంచి సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా నిలిచిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌లో టమాటా ధర ఐదు రెట్లు పెరిగి కిలో రూ.600కు చేరిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అఫ్గాన్ నుంచి దిగుమతి అయ్యే యాపిల్ వంటి పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి, సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.


