Friday, January 16, 2026
Homeఇంటర్నేషనల్Bangladesh Pakistan defense: మారిన సమీకరణాలు: జేఎఫ్-17 థండర్ విమానాల కోసం పాక్‌తో బంగ్లాదేశ్ చర్చలు

Bangladesh Pakistan defense: మారిన సమీకరణాలు: జేఎఫ్-17 థండర్ విమానాల కోసం పాక్‌తో బంగ్లాదేశ్ చర్చలు

JF-17 Thunder: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య మారుతున్న దౌత్య, రక్షణ సమీకరణాల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అండతో పాకిస్తాన్ తయారు చేసిన JF-17 థండర్ యుద్ధ విమానాల కొనుగోలుపై బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన ఇరు దేశాల వైమానిక దళాధిపతుల భేటీలో ఈ అంశంపై చర్చలు జరిగినట్లు పాకిస్తాన్ సైనిక మీడియా విభాగం (ISPR) వెల్లడించింది.

- Advertisement -

పాకిస్థాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ, బంగ్లాదేశ్ వైమానిక దళాధిపతి హసన్ మహమూద్ ఖాన్ మధ్య జరిగిన ఈ చర్చల్లో ప్రధానంగా జేఎఫ్‌-17 విమానాల సేల్, శిక్షణ, రక్షణ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారించారు. కేవలం యుద్ధ విమానాలే కాకుండా, ‘సూపర్ ముషక్’ శిక్షణ విమానాలను వేగంగా సరఫరా చేస్తామని, వీటికి సంబంధించి పూర్తి స్థాయి మద్దతు, శిక్షణ వ్యవస్థను అందిస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చినట్లు వెల్లడైంది. అయితే ఈ ఒప్పందంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

also read Madhav Gadgil : పర్యావరణ యోధుడు మాధవ్ గాడ్గిల్ అస్తమయం!

చైనా పాకిస్తాన్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ జేఎఫ్‌-17 థండర్ విమానాలు తేలికపాటి మల్టీ-రోల్ సామర్థ్యం కలిగినవి. బంగ్లాదేశ్‌లో ఆగస్టు 2024 తర్వాత ఏర్పడిన రాజకీయ మార్పుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ భేటీకి కొద్ది రోజుల ముందే బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్‌తో పాక్ హైకమీషనర్ ఇమ్రాన్ హైదర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దౌత్యపరమైన అంశాలతో పాటు రక్షణ సహకారంపై కూడా చర్చలు జరిగాయి.

JF-17 థండర్ ప్రత్యేకతలు..
ఈ యుద్ధ విమానం చైనాకు చెందిన చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసినది. ఇది ఒక సింగిల్ ఇంజిన్, తేలికపాటి మల్టీ-రోల్ యుద్ధ విమానం. తక్కువ ఖర్చుతో కూడిన నిర్వహణ, అధునాతన ఆయుధ వ్యవస్థలను కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

పాక్ బంగ్లా మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణలో భాగంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకోబడింది. దాదాపు పుష్కర కాలం తర్వాత ఢాకా, కరాచీ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. జనవరి 29 నుండి బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. రక్షణ ఒప్పందాలు, విమాన సర్వీసుల ప్రారంభం వంటి పరిణామాలు దక్షిణ ఆసియాలో మారుతున్న రాజకీయ ధోరణులకు అద్దం పడుతున్నాయి. మెుత్తానికి ఆయుధాల డీల్ ఫైనల్ అయితే బంగ్లాదేశ్ వైమానిక సామర్థ్యం పెరగడంతో పాటు, పాకిస్తాన్ ఆయుధ ఎగుమతుల రంగంలో తన పట్టును నిరూపించుకున్నట్లవుతుందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News