Pakistan Bomb Blast: పాకిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌లో గురువారం భారీ బాంబు దాడీ జరిగింది. బాంబు పేలుళ్లతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ బాంబు పేలుళ్ల ధాటికి తొమ్మిది మంది మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. పీవోకేలో నిరసనలు జరుగుతున్నాయి. దీంతో, నిరసనకారులను అదుపు చేసేందుకు ఓవైపు అక్కడి పోలీసులు సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతుండగా.. మరోవైపు, కైబర్ పఖ్తుంఖ్వాలో పోలీసులే లక్ష్యంగా సామాన్యులు బాంబు దాడులతో హడలెత్తిస్తున్నారు. అయితే, పోలీస్ అధికారులే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ దాడిని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ కార్యాలయం ధృవీకరించింది. బాంబు దాడి అనంతరం, ఆ ప్రదేశంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. పేలుడికి కారణమైన పరికరాన్ని పోలీసులు ఎక్కువగా తిరిగే మార్గంలోనే అమర్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పీవోకేలో జెన్జీ ఉద్యమం..
అంతకు ముందు సెప్టెంబర్ 30న పాకిస్థాన్లోని క్వెట్టా నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. క్వెట్టాలోని ఝార్గూన్ రోడ్డుమార్గంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం కాల్పుల మోతలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత నగరంలోని అన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రధాన రహదారి మీద జరిగిన ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. మరోవైపు, పీవోకేలో నిరసనకారులు పాకిస్థాన్ ఆర్మీ వెహికల్ను తగులబెట్టేశారు. దీని తరువాత ఆర్మీ ప్రజలపై కాల్పులు జరిపింది. ఇందులో 40 మంది దాకా సామాన్య జనం చనిపోయారని తెలుస్తోంది. మరోవైపు, బలూచిస్తాన్ రెబల్స్ ఇప్పటికే ఈ ప్రావిన్స్లోని మెజారిటీ ప్రాంతాలను కైవసం చేసుకున్నారు. కాగా, పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న పీవోజేకే లో జెన్ జీ ఉద్యమం మొదలైంది. నేపాల్ తరహాలో జెన్ జీలు ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తున్నారు. తమ ప్రాంత వాసులను పాకిస్థాన్ వాళ్లు నిరంకుశంగా అణగదొక్కుతున్నారనే ఆక్రోశంతో అక్కడ ప్రత్యేక ఉద్యమం మొదలైంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్.. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ను కైవసం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. కానీ, తాజాగా అక్కడ యువకులు పాక్ పాలకులపై కదం తొక్కడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


