Diplomatic relations India-Pakistan : కయ్యానికి కాలుదువ్వడంలో పాకిస్తాన్ తీరు మారలేదు. సరిహద్దుల్లో కాల్పులకే పరిమితం కాని దాని వక్రబుద్ధి, ఇప్పుడు దౌత్య సంబంధాలపైనా విషం చిమ్ముతోంది. అంతర్జాతీయ ఒప్పందాలను, కనీస మర్యాదలను కాలరాస్తూ ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దౌత్యవేత్తల నివాసాలకు గ్యాస్, నీళ్లు, చివరకు వార్తాపత్రికల సరఫరాను కూడా నిలిపివేసి తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకుంది. అసలు పాకిస్తాన్ ఈ నీచమైన చర్యలకు ఎందుకు పాల్పడుతోంది..? ఇది దౌత్యవేత్తల హక్కులను కాపాడే వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడం కాదా..? భారత్ దీనిపై ఎలా స్పందించనుంది..?
ఇస్లామాబాద్‌లో భారత దౌత్యవేత్తలకు వేధింపులు : ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న దౌత్యవేత్తలు, వారి కుటుంబాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, దౌత్యవేత్తలు నివసిస్తున్న ప్రాంగణంలోకి నిత్యావసరాలైన వంట గ్యాస్, తాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. భారత హైకమిషన్ ప్రాంగణంలో గ్యాస్ పైప్‌లైన్లు ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా సరఫరాను ఆపేశారు. అంతేకాకుండా, బయట గ్యాస్ సిలిండర్లు విక్రయించే వారిని కూడా భారత సిబ్బందికి అమ్మవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దౌత్యవేత్తల కుటుంబాలు అధిక ధరలకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
గ్యాస్‌తో ఆగకుండా, తాగునీటి సరఫరాను కూడా నిలిపివేశారు. స్థానిక వ్యాపారులు భారత దౌత్యవేత్తలకు నీటిని అమ్మవద్దని హుకుం జారీ చేశారు. పంపు నీరు సురక్షితం కాకపోవడంతో దౌత్యవేత్తల కుటుంబాలు, ముఖ్యంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు, దౌత్యవేత్తల ఇళ్లకు రోజూ వచ్చే వార్తాపత్రికల సరఫరాను కూడా అడ్డుకోవడం పాకిస్తాన్ కుటిలనీతికి నిదర్శనం. వీటికి తోడు, భారత దౌత్యవేత్తలపై నిఘాను కూడా పెంచి, వారి ప్రతి కదలికను గమనించేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది.
వియన్నా ఒప్పందానికి పాతర : పాకిస్తాన్ చర్యలు, దౌత్యవేత్తల హక్కులు, వారి గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన వియన్నా ఒప్పందాన్ని (1961) పూర్తిగా ఉల్లంఘించడమే. ఈ ఒప్పందం ప్రకారం, ఆతిథ్య దేశం తమ దేశంలోని విదేశీ దౌత్యవేత్తలందరికీ భద్రత, గౌరవంతో పాటు వారు తమ విధులను సజావుగా నిర్వర్తించుకోవడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలి. కానీ పాకిస్తాన్ చర్యలు ఈ ఒప్పంద స్ఫూర్తికే తూట్లు పొడిచేలా ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన చర్య అని, ఇలాంటివి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని భారత అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. దీనికి ప్రతిగా న్యూఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్యవేత్తలకు కూడా వార్తాపత్రికల సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ప్రతీకార చర్యలేనా : భారత దౌత్యవేత్తలపై పాకిస్తాన్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2019 పుల్వామా దాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా పాక్ ఇలాంటి చర్యలకే పాల్పడింది. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం వంటి పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. తాజా సంఘటనలు ఈ వైరాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.


