Pakistan Floods: ఎన్నడూ లేని విధంగా ప్రకృతి ప్రకోపంతో అల్లాడిపోతోంది పాకిస్థాన్. ఈసారి కురుస్తున్న వర్షాలతో పాకిస్థాన్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దీనిని బట్టి పాకిస్థాన్ పై వరుణ ప్రభావం ఏవిధంగా ఉందొ తెలుస్తుంది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాక్ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో వరదలు, ఇళ్ల ధ్వంసం, ప్రాణ నష్టం వంటి ఘోర పరిణామాలు చోటుచేసుకున్నాయి. విపత్కర పరిస్థితుల దృష్ట్యా, పాకిస్థాన్ జాతీయ అత్యవసర కార్యకలాపాల కేంద్రం దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లోని వరద ప్రభావిత జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచారు.
Readmore: https://teluguprabha.net/international-news/kai-trump-net-worth-golf-nil-deals/
గతంలో ఎప్పుడూ లేని విధంగా కురిసిన వర్షాలకు పాకిస్థాన్ అల్లాడిపోతుంది. ఈ కారణంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా గడిచిన 24 గంటల్లో 119 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 1033 మంది మరణించారని.. 1,527 మంది గాయపడ్డారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. పాక్‌లో రెస్క్యూ, రిలీఫ్, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని పాక్ అధికారులు తెలిపారు.
దాయాది దేశంలో గత పక్షం రోజుల నుంచి భీకర వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ, నైరుతి పాకిస్థాన్‌లో తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. వరదల కారణంగా వేల కిలోమీటర్ల రహదారులు, వాటికి అనుసంధానంగా ఉన్న 149 వంతెనలు దెబ్బతిన్నాయి. ఎంతమేరకు ఆర్థిక నష్టం వాటిల్లందనేదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ వర్షాల కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో పాటు అక్కడి ప్రజలు నిర్వాసితులుగా మారారు. ఎన్నో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.
ఈ వర్షాలకు పాక్‌లో 110 జిల్లాల్లోని 57 లక్షలమందికి ఆహారం అందడం లేదని వివరించింది. అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని పాక్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మరో వైపు, ఈ ప్రతికూల వాతావరణం కారణంగా బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు విమాన రాకపోకలను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ నిలిపివేసింది.
పాకిస్థాన్‌ను ఆదుకునేందుకు పాక్ మిత్ర దేశాలు ముందుకొచ్చి మానవత్వం చాటుకున్నాయి. అత్యవసర సహాయాన్ని అందిస్తామని ప్రకటించాయి. పాకిస్తాన్ లో ఈ ఏడాది సగటు కంటే భారీ శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది.


