Celebratory gunfire turns deadly in Pakistan : పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నెత్తురోడాయి. సంబరాలు జరుపుకోవాల్సిన చారిత్రక రోజున, కరాచీ నగరం తుపాకుల మోతతో దద్దరిల్లింది. దేశభక్తి స్థానంలో భయానక వాతావరణం ఆవరించింది. అర్ధరాత్రి వేళ ఆకాశంలోకి దూసుకెళ్లిన తూటాలు, పండుగ చేసుకుంటున్న అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. ఈ అనాగరిక చర్య వెనుక ఉన్న కారణాలేంటి..? ప్రతీ ఏటా పునరావృతమవుతున్న ఈ మారణహోమానికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది..?
నగర వీధుల్లో నరమేధం : పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరాచీలోని అనేక ప్రాంతాల్లో వేడుకల పేరుతో కొందరు జరిపిన గాలిలో కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనల్లో ఎనిమిదేళ్ల చిన్నారి, ఒక వృద్ధుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 64 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరాచీలోని లియాఖతాబాద్, కోరంగి, మెహబూబాబాద్, అఖ్తర్ కాలనీ, బాల్దియా, ఓరంగీ టౌన్ వంటి అనేక ప్రాంతాలు తుపాకీ కాల్పులతో దద్దరిల్లాయి. అజీజాబాద్‌లో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారి తూటా తగిలి అక్కడికక్కడే మృతి చెందగా, కోరంగి ప్రాంతంలో ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచాడు.
గత చరిత్ర పునరావృతం : పాకిస్థాన్‌లో, ముఖ్యంగా కరాచీలో, వేడుకల సమయంలో గాలిలోకి కాల్పులు జరపడం ఒక ప్రమాదకరమైన సంస్కృతిగా మారింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ ఇదే తరహా కాల్పుల్లో 90మందికి పైగా గాయపడ్డారు. కేవలం ఈ ఏడాది జనవరిలోనే కరాచీ వ్యాప్తంగా జరిగిన వివిధ కాల్పుల ఘటనల్లో ఐదుగురు మహిళలతో సహా 42 మంది ప్రాణాలు కోల్పోగా, 233 మందికి గాయాలయ్యాయి. ఈ గణాంకాలు నగరంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
అధికారుల స్పందన, దర్యాప్తు : ఈ భయానక ఘటనను అధికారులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బాధ్యతాయుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని పౌరులకు సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి అత్యాధునిక ఆయుధాలతో పాటుగా.. మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అయితే, ప్రతీ ఏటా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, వాటిని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోందని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.


