Wednesday, February 11, 2026
HomeTop StoriesBangladesh riots: బంగ్లా‌దేశ్‌లో అల్లర్లు పాకిస్థాన్ పనేనా?.. భారత్‌ టార్గెట్‌గా కుట్ర చేస్తోందా?.. పూర్తి విశ్లేషణ...

Bangladesh riots: బంగ్లా‌దేశ్‌లో అల్లర్లు పాకిస్థాన్ పనేనా?.. భారత్‌ టార్గెట్‌గా కుట్ర చేస్తోందా?.. పూర్తి విశ్లేషణ ఇదే..!

Pakistan Is Behind the riots in Bangladesh: దశాబ్ధాల కాలం నుంచి భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్‌ను భారత్‌కు దూరం చేయాలనే కుట్ర జరుగుతోందా? బంగ్లాదేశ్‌లో అల్లర్లు పాకిస్తాన్‌ పనేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కుట్రలో భాగంగానే బంగ్లాదేశ్, భారత్ మధ్య విభేదాలు తీసుకురావడానికి ఓ శక్తి పని చేస్తోందని, విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో హింస చెలరేగడం పాకిస్తాన్‌ పనేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ హత్య వెనుక భారీ కుట్ర జరిగిందని, నిందితులు భారత్‌కు పారిపోయారని ఆరోపిస్తూ నిరసనకారులు భారత రాయబార కార్యాలయాల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, చిట్టగాంగ్‌లోని భారత డిప్యూటీ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసమే టార్గెట్‌గానే అక్కడ రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా పాత సంప్రదాయ పార్టీలకు (బంగ్లాదేశ్ నేషనలిస్ట్, జమాతే ఇస్లామీ), కొత్తగా వస్తున్న విద్యార్థి శక్తులకు (ఎన్‌సీపీ) మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన అస్థిరతను అదునుగా తీసుకుని, కొందరు దుండగులు బెంగాలీ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ‘ఛాయానాట్’పై జరిగిన దాడి ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

- Advertisement -

బంగ్లాదేశ్‌లో ఈ పార్టీలదే హవా..

2024 ఆగస్టులో విద్యార్థుల తిరుగుబాటులో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైంది. అనంతరం బంగ్లాదేశ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. దీనిలో మొదటిది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన రాజకీయ పార్టీ ఇదే. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ఈ పార్టీ.. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, బంగ్లాదేశ్‌లో కొసాగుతున్న మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్. షేక్ హసీనా నేతృత్వంలోని ఈ పార్టీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉంది. అయితే, ఇటీవల పరిణామాల తర్వాత ఈ పార్టీ నాయకులు దేశం విడిచి వెళ్లడం లేదా అరెస్టవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పార్టీ కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై అనిశ్చితి నెలకొంది. ఇక, బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో ప్రభావం చూపనున్న మూడో పార్టీ జమాతే ఇస్లామీ. ఈ పార్టీ గతంలో నిషేధానికి గురైంది. ఇది ముస్లిం మతతత్వ పార్టీగా గుర్తింపు పొందింది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం హయాంలో మళ్లీ పుంజుకుంది. యువత, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి దీనికి మద్దతు పెరుగుతోంది. ఇక, ఇటీవల స్టూడెంట్స్ కొత్తగా పెట్టిన నేషనల్ సిటిజన్ పార్టీ కూడా ప్రభావం చూపనుంది. 2025 ఫిబ్రవరిలో విద్యార్థి నాయకులు ఈ పార్టీని స్థాపించారు. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి ఉద్యమం నుండి ఈ పార్టీ పుట్టింది.

దాడుల వెనుక పాకిస్తాన్?

పాకిస్తాన్‌లో జరుగుతున్న దాడుల వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ కుట్ర ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మతతత్వ శక్తులను ప్రోత్సహించడం ద్వారా బెంగాలీ భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని తుడిచిపెట్టాలని పాక్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు గానూ 1971 తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పాకిస్థాన్ సైన్యం బెంగాలీ మేధావులను, కళాకారులను ఏ విధంగా లక్ష్యం చేసుకుందో, ఇప్పుడు కూడా అదే తరహాలో దాడులు జరుగుతుండటం గమనార్హం. ఈ దాడులు చేస్తున్న వారు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత అనుకూల పత్రికలుగా ముద్రవేసి మీడియా సంస్థలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, సాంస్కృతిక కేంద్రాలపై దాడులు చేస్తూ.. కేవలం ఆస్తులను మాత్రమే కాదు, బంగ్లాదేశ్ ఆత్మపై దాడులు చేస్తున్నారు. ఒకవేళ ఈ ధోరణి కొనసాగితే, బంగ్లాదేశ్ తన సెక్యులర్ గుర్తింపును కోల్పోయి పాకిస్తాన్‌ మాదిరిగా మతతత్వ దేశంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో విఫలమైతే, ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలా బంగ్లాదేశ్‌ను ముస్లీం దేశంగా మార్చి భారత్‌పై దాడులు పాల్పడాలని పాకిస్తాన్‌ ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు భావస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News