Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Pakistan Floods: పాక్‌లో ప్రళయ ఘోష.. జల విలయానికి 214 మంది బలి!

Pakistan Floods: పాక్‌లో ప్రళయ ఘోష.. జల విలయానికి 214 మంది బలి!

Heavy Rains Deaths Pakistan: పాకిస్థాన్‌లో వరుణుడు ప్రళయ నృత్యం చేస్తున్నాడు! పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కకావికలం చేస్తున్నాయి. కేవలం 24 గంటల్లోనే 200 మందికి పైగా జలసమాధి అయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఆకస్మిక వరదలకు కారణమేంటి..? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా..? గ్లోబల్ వార్మింగ్ పాకిస్థాన్‌ పాలిట శాపంగా మారిందా..?

- Advertisement -

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలో రుతుపవనాలు మృత్యుఘోష సృష్టిస్తున్నాయి. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ జల ప్రళయానికి 214 మంది బలయ్యారు. ఈ సీజన్‌లో వర్షాల కారణంగా మరణించిన వారి మొత్తం సంఖ్య 360 దాటింది. పీవోకేలోని గిల్గిట్-బల్టిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో ప్రాణనష్టం తీవ్రంగా ఉంది.

విలయానికి కేంద్రంగా ఖైబర్ పఖ్తుంఖ్వా : ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో గురువారం రాత్రి నుంచి వర్షం బీభత్సం సృష్టించింది. బునేర్ జిల్లాలో అత్యధికంగా 75 మంది, మాన్‌సెహ్రాలో 17, బాజౌర్ మరియు బాటాగ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రావిన్స్ వ్యాప్తంగా మొత్తం 125 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. అనేక మంది గల్లంతవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) ప్రతినిధి ఫైజీ ఆందోళన వ్యక్తం చేశారు. మాన్‌సెహ్రా జిల్లాలోని సిరాన్ లోయలో కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోగా, చిక్కుకుపోయిన 1300 మంది పర్యాటకులను సైన్యం, విపత్తు నిర్వహణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/putin-sends-independence-day-greetings-modi-praises-india-russia-partnership/

కకావికలమైన జనజీవనం : వరదల ఉద్ధృతికి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నీట మునిగాయి. అనేక వాహనాలు, వంతెనలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. నీలమ్ వ్యాలీ వంటి పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

గ్లోబల్ వార్మింగ్ శాపం : ఈ విలయానికి ప్రధాన కారణంగా గ్లోబల్ వార్మింగ్‌ను నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్ 75 శాతం నీటి అవసరాలను తీర్చే గిల్గిట్-బల్టిస్థాన్‌లోని హిమానీనదాలు (glaciers) వేగంగా కరిగిపోవడమే ఈ ఆకస్మిక వరదలకు కారణమవుతోంది. హిమనీనదాలు కరిగి ఏర్పడిన సరస్సులు ఒక్కసారిగా పగిలిపోవడంతో (GLOFs – Glacial Lake Outburst Floods) ఊహించని రీతిలో వరదలు పోటెత్తుతున్నాయి. 2022లో సంభవించిన వరదల్లో 1700 మందికి పైగా చనిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిన చేదు అనుభవాన్ని ఈ ప్రస్తుత విపత్తు గుర్తుచేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad