పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌లోని కుజ్‌దార్ జిల్లాలో స్కూల్ బస్సుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో 38 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చాలామంది చిన్నపిల్లలే కావడం మరింత కలచివేస్తోంది. పట్టణానికి చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ బస్సు విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా, ఓ కారులో వచ్చిన ఆత్మాహుతి బాంబర్ బస్సును ఢీకొన్నాడు. బస్సు సమీపంలో భారీ పేలుడు సంభవించి పూర్తిగా ధ్వంసమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు, రెస్క్యూ టీంలు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి.
ఈ దాడికి ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించకపోయినా, అక్కడి అధికారుల అనుమానం బలూచ్ వేర్పాటువాద గ్రూపులపైకి మళ్లింది. ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేరు ఈ తరహా దాడుల్లో తరచూ వినిపిస్తోంది. గతంలోనూ ఈ సంస్థ పౌరులపై, భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడింది. ఈ ఘటనపై పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసీన్ నఖ్వీ తీవ్రంగా స్పందించారు. చిన్నారులపై దాడి చేయడమేంటో వాళ్లకు తెలిసేది లేదు. శత్రువులే కాదు, మానవత్వం లేకుండా ప్రవర్తించిన మృగాలు వాళ్లు అని ధ్వజమెత్తారు. బలూచిస్తాన్‌లో శాంతిని స్థాపించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.