Jaish-e-Mohammed Online ‘Jihadi Course’ For Women: పాకిస్తాన్‌కు చెందిన, ఐక్యరాజ్యసమితి (UN)చే ఉగ్రవాద సంస్థగా ప్రకటించబడిన జైష్-ఎ-మహ్మద్ (JeM) మహిళల కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, తాజాగా అందుబాటులోకి వచ్చిన పత్రాల ప్రకారం.. ఈ ఉగ్ర సంస్థ మహిళల నుంచి నిధులు సేకరించడానికి, రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించడానికి ‘తుఫత్ అల్-ముమినాత్’ అనే పేరుతో ఆన్‌లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించింది.
ఈ కోర్సులో జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్, అతని కమాండర్ల కుటుంబాలకు చెందిన మహిళా సభ్యులు ఇతరులకు ‘జిహాద్’ మరియు ‘ఇస్లాం’కు సంబంధించి వారి ‘బాధ్యతలను’ బోధిస్తారు. నవంబర్ 8 నుంచి ఆన్‌లైన్‌లో ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభం కానుంది.
ఆన్‌లైన్ ప్రసంగాలు, ఫీజు వసూలు
ఈ కోర్సులో భాగంగా, ప్రతిరోజూ 40 నిమిషాల పాటు ‘ఉపన్యాసాలు’ ఉంటాయి. మసూద్ అజహర్ ఇద్దరు సోదరీమణులు, సాదియా అజహర్, సమైరా అజహర్, ఈ తరగతులను నడుపుతారు. మహిళలను జమాత్ ఉల్-ముమినాత్ (మహిళా యూనిట్)లో చేరడానికి ‘ప్రోత్సహించడమే’ ఈ తరగతుల ప్రధాన లక్ష్యం. మసూద్ అజహర్ చిన్న చెల్లెలైన సాదియా అజహర్‌కు ఈ మహిళా యూనిట్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ALSO READ: Trump: ట్రంప్ దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష!
ఈ ఆన్‌లైన్ ‘జిహాదీ కోర్సులో’ చేరే ప్రతి మహిళ నుంచి జైష్ సంస్థ 500 పాకిస్తాన్ రూపాయలు (సుమారు ₹156 భారతీయ రూపాయలు) వసూలు చేస్తోంది. అంతేకాకుండా, ఆన్‌లైన్ సమాచార ఫారమ్‌ను కూడా పూరింపజేస్తోంది. పాకిస్తాన్‌లో మహిళలు ఒంటరిగా బయటకు రావడం సరికాదనే కఠిన సామాజిక నిబంధనలను తప్పించుకోవడానికి ఈ ఉగ్ర సంస్థ ఆన్‌లైన్ వేదికను ఉపయోగించుకుంటోంది.
మసూద్ అజహర్ తన ‘విరాళాల’ సేకరణను కూడా వేగవంతం చేశాడు. గత నెలలో బహావల్‌పూర్‌లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో బహిరంగ ప్రసంగం చేసిన తర్వాత ఈ నిధుల సేకరణ పెరిగింది.
ఆపరేషన్ సింధూర్లో జైష్ ప్రధాన కార్యాలయంపై జరిగిన వైమానిక దాడిలో మృతి చెందిన అజహర్ బంధువుల కుటుంబ సభ్యులు, అలాగే పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉమర్ ఫరూక్ భార్య ఆఫ్రీన్ ఫారూక్ కూడా ఈ కోర్సులో బోధించేవారిలో ఉన్నారు. 500 పీకేఆర్ వసూలు చేయడం ద్వారా, ఆర్థిక చర్యల కార్యదళం (FATF) నిబంధనలను పాటించామన్న పాక్ వాదనలోని కపటత్వం ఈ చర్యతో బయటపడుతోందని నిపుణులు పేర్కొన్నారు.
ALSO READ: Country: సొంత కరెన్సీ లేదు, ఎయిర్‌పోర్ట్ లేదు.. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం


