Wednesday, February 11, 2026
Homeఇంటర్నేషనల్DEFENSE : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. పాక్-అమెరికా సైనిక విన్యాసాలు!

DEFENSE : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. పాక్-అమెరికా సైనిక విన్యాసాలు!

Pakistan-US joint military exercise : ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉండి, ఆ తర్వాత దూరమైన అమెరికా, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయా? ఇరు దేశాల సైన్యాలు కలిసి ఉగ్రవాదంపై పోరుకు సిద్ధమయ్యాయా? అవుననే సంకేతాలనిస్తూ, పాకిస్థాన్ గడ్డపై ఇరు దేశాల సైన్యాలు సంయుక్త విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. ‘ఇన్‌స్పైర్డ్ గాంబిట్–2026’ పేరుతో ప్రారంభమైన ఈ విన్యాసాలు, దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 

- Advertisement -

పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం, ఐఎస్‌పీఆర్ (ISPR) శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం..13వ పాకిస్థాన్-అమెరికా ద్వైపాక్షిక సంయుక్త విన్యాసం, ‘ఇన్‌స్పైర్డ్ గాంబిట్–2026’.  శుక్రవారం నుంచి ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌, ఖరియాన్ జిల్లా, పబ్బి పట్టణంలో ఉన్న ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ (NCTC)లో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. రెండు వారాల పాటు ఈ విన్యాసాలు కొనసాగుతాయి.

విన్యాసాల లక్ష్యం : ఉగ్రవాద నిరోధక  కార్యకలాపాలే లక్ష్యంగా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. “పరస్పర అవగాహన, కలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఉగ్రవాద నిరోధక అనుభవాలను పంచుకోవడం, వ్యూహాలు, సాంకేతికతలను మరింత మెరుగుపరుచుకోవడం” ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యమని ఐఎస్‌పీఆర్ తెలిపింది.
మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో, సంక్లిష్టమైన ఉగ్రవాద నిరోధక వాతావరణంలో పనిచేసే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంలో ఇలాంటి విన్యాసాలు అత్యంత కీలకమని పాక్ సైన్యం పేర్కొంది.

భారత్‌పై ప్రభావం.. నిపుణుల విశ్లేషణ : ఈ పరిణామాన్ని భారత ప్రభుత్వం అత్యంత నిశితంగా గమనిస్తోంది. అమెరికా, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఈ సైనిక సహకారం, ప్రాంతీయ భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత, ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్థాన్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం అమెరికాకు ఏర్పడింది. అయితే, ఇదే సమయంలో భారత్‌తోనూ అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (క్వాడ్ వంటివి) బలోపేతం చేసుకుంటోంది.

పాకిస్థాన్, చైనాతో కలిసి కూడా ఇదే NCTC కేంద్రంలో విన్యాసాలు నిర్వహిస్తుంటుంది. అలాంటి ప్రదేశంలో అమెరికా విన్యాసాలు నిర్వహించడం, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలకు అద్దం పడుతోంది. ఏది ఏమైనా, ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుపొందిన పాకిస్థాన్‌తో, ఉగ్రవాద నిరోధక విన్యాసాలను అమెరికా నిర్వహించడం, దౌత్యపరంగా ఓ కీలక పరిణామం. దీని దీర్ఘకాలిక ప్రభావాలను న్యూఢిల్లీ జాగ్రత్తగా అంచనా వేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News