Wednesday, February 18, 2026
Homeఇంటర్నేషనల్Integration : పాలస్తీనాలో పొత్తు పొడిచేనా? హమాస్‌కు పీఎల్ఓ షరతు!

Integration : పాలస్తీనాలో పొత్తు పొడిచేనా? హమాస్‌కు పీఎల్ఓ షరతు!

Hamas and PLO integration mandate : గాజాలో తుపాకుల మోత, శిథిలాల మధ్య చిక్కుకున్న వేలాది ప్రాణాలు.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య సాగుతున్న సుదీర్ఘ పోరు పశ్చిమాసియాను రక్తాశ్రువులతో ముంచెత్తుతోంది. ఈ భయానక వాతావరణంలో పాలస్తీనా భవిష్యత్తుపై ఒక కీలకమైన, ప్రపంచాన్ని ఆకర్షించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాలస్తీనా విముక్తి సంస్థ (PLO) అనే గొడుగు కిందకు హమాస్ రావాలని, అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనాకు గుర్తింపు, శాంతి లభిస్తాయని ఆ దేశ విదేశాంగ మంత్రి వర్సెన్ అఘబేకియన్ షాహిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ఉనికిని వ్యతిరేకిస్తున్న హమాస్, ఇప్పుడు ఆ దేశాన్ని గుర్తిస్తుందా? తుపాకీ పట్టిన చేతులు అహింసా మార్గంలో నడుస్తాయా? ఈ విలీన ప్రతిపాదన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి?

- Advertisement -

విలీన వ్యూహం: పీఎల్ఓ నిబంధనలే కీలకం : పాలస్తీనా విదేశాంగ మంత్రి షాహిన్ ‘ది హిందూ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ విలీన ప్రక్రియలో ఆమె ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు.

పీఎల్ఓ గొడుగు కిందకు రావాల్సిందే: “పాలస్తీనా రాజకీయ నిర్మాణంలో భాగం కావాలనుకునే ఏ వర్గమైనా తప్పనిసరిగా పీఎల్ఓలో చేరాలి” అని షాహిన్ స్పష్టం చేశారు. పీఎల్ఓ అనేది పాలస్తీనాలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సంస్థ. హమాస్ ప్రస్తుతం గాజాలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నప్పటికీ, జాతీయ స్థాయి గుర్తింపు కోసం పీఎల్ఓ నిబంధనలకు కట్టుబడక తప్పదని ఆమె తేల్చి చెప్పారు.

ఇజ్రాయెల్ గుర్తింపు – అతిపెద్ద సవాలు: ఈ ప్రతిపాదనలో అత్యంత వివాదాస్పదమైన అంశం ‘ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడం’. పీఎల్ఓ నిబంధనల ప్రకారం ఇజ్రాయెల్ రాజ్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ అంతమే తన లక్ష్యమని ప్రకటించిన హమాస్, ఈ నిబంధనకు తలొగ్గుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. “అవిభక్త పాలస్తీనా” కోసం పోరాడాలంటే దౌత్యపరమైన మార్గాలే శరణ్యమని షాహిన్ అభిప్రాయపడ్డారు.

అహింస వైపు అడుగులు: కేవలం చర్చల ద్వారానే పాలస్తీనా స్వేచ్ఛ సాధ్యమని పీఎల్ఓ భావిస్తోంది. అందుకే హమాస్ తన హింసాత్మక మార్గాలను వీడి, అహింసా యుత పోరాటానికి కట్టుబడి ఉండాలని విదేశాంగ మంత్రి సూచించారు. ఇది అంతర్జాతీయ సమాజంలో పాలస్తీనా వాదనకు బలాన్ని చేకూరుస్తుందని ఆమె విశ్లేషించారు.

చారిత్రక నేపథ్యం: 2006 నుంచి కొనసాగుతున్న చీలిక, పాలస్తీనా రాజకీయాల్లో ఈ గందరగోళం ఈనాటిది కాదు.
2006 ఎన్నికలు: గాజా స్ట్రిప్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ మహ్మూద్ అబ్బాస్‌కు చెందిన ‘ఫతా’ (Fatah) పార్టీని ఓడించి హమాస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్‌లో ఫతా ఆధ్వర్యంలోని పాలస్తీనా అథారిటీ, గాజాలో హమాస్ పాలన సాగిస్తున్నాయి. ఈ చీలిక వల్ల ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపే సమయంలో పాలస్తీనా బలహీనపడుతోందన్నది వాస్తవం.

 డ్రాగన్ రాయబారం ఫలిస్తుందా : చైనా మధ్యవర్తిత్వంతో ఇటీవలే హమాస్-ఫతా మధ్య చర్చలు జరిగిన నేపథ్యంలో షాహిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు” అన్న చందంగా ఉన్న ఈ రెండు వర్గాలు ఒక్కటి కావడం అంత సులభం కాదు. అయితే, గాజాలో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, మనుగడ కోసం హమాస్ తన పంథాను మార్చుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News