Parents Allegedly Abandon 10-Year-Old At Airport For Vacation: అన్నింటికన్నా గొప్పది తల్లి పేగు బంధం. బిడ్డకు ఏ చిన్న గాయం తగిలినా ఆ తల్లి ఓర్చుకోలేదు. అటువటివంటిది మానవ సంబంధాలు, కన్న ప్రేమనే ప్రశ్నార్థకం చేసే ఘటన స్పెయిన్‌లో వెలుగుచూసింది. ఓ పదేళ్ల చిన్నారిని విమానాశ్రాయంలోనే వదిలేసి ఎంచక్కా హాలిడే చెక్కేశారు అతడి తల్లిదండ్రులు. అయితే వారికి తగిన బుద్ధి చెప్పారు విమానాశ్రయ సిబ్బంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
విమానంలో వెళ్లాల్సిన ఓ కుటుంబం, తమ పదేళ్ల కొడుకు ప్రయాణ పత్రాల్లో (పాస్‌పోర్ట్ గడువు తీరడం, వీసా సమస్య) లోపాలు ఉన్నాయని తెలుసుకున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు లేదా మార్చుకుంటారు. కానీ ఆ తల్లిదండ్రులు విస్మయం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. బాలుడిని అక్కడే విమానాశ్రయంలో వదిలేసి, బంధువులు వచ్చి తీసుకెళ్తారని చెప్పి, ఏ మాత్రం బెరుకు లేకుండా తమ విమానం ఎక్కేశారు.
ఆ చిన్నారి ఒంటరిగా విమానాశ్రయం టెర్మినల్‌లో దిక్కులు చూస్తుండగా, సిబ్బంది గమనించి ఆరా తీశారు. “అమ్మానాన్న సెలవులకు వెళ్తున్నారు, నన్ను ఇక్కడే వదిలేశారు” అని ఆ అమాయక బాలుడు చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. పోలీసులు వెంటనే స్పందించారు. అప్పటికే టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి ఆ తల్లిదండ్రుల లగేజీని దించివేసి, వారిని విమానంలోంచి కిందికి దించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
“ఇలాంటి ఘటన ఊహించలేము. సొంత బిడ్డనే వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధాకరం” అని ఓ విమానయాన అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దంపతులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఒక వైపు సెలవుల ఆనందం కోసం, మరో వైపు తమ బిడ్డ భవిష్యత్తును పణంగా పెట్టిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.


