Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్US-India Tensions : భారత్‌పై నవారో అక్కసు.. మస్క్‌పై విమర్శల రక్కసు!

US-India Tensions : భారత్‌పై నవారో అక్కసు.. మస్క్‌పై విమర్శల రక్కసు!

Peter Navarro comments on India Russia oil deal : భారత్-అమెరికా మధ్య ఇప్పటికే పెరుగుతున్న సుంకాల చిచ్చుకు రష్యా చమురు ఆజ్యం పోస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో, భారత్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. కేవలం లాభాల కోసమే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, ఆ సొమ్ముతో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేయడంతో, నవారో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా ఎలాన్ మస్క్‌నే లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు. అసలు నవారో ఆరోపణల్లో నిజమెంత..? కేవలం లాభం కోసమే భారత్ రష్యా వైపు చూస్తోందా..? ఈ వివాదం ఇరు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

- Advertisement -

లాభం కోసమే.. రష్యాకు ఇంధననం:అమెరికా-భారత్ సంబంధాలు క్లిష్టంగా మారుతున్నాయన్న వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఆ కథనంపై స్పందించిన పీటర్ నవారో తాజా వివాదానికి నాంది పలికారు.

వాస్తవాలు ఇవి: భారత్ విధిస్తున్న అధిక సుంకాలు అమెరికా ఉద్యోగాలను దెబ్బతీస్తున్నాయి. కేవలం లాభం కోసమే భారత్ రష్యా నుంచి చమురు కొంటోంది. ఆ ఆదాయం రష్యా యుద్ధ యంత్రానికి ఇంధనంగా మారుతోంది. దీనివల్ల ఉక్రెయిన్లు, రష్యన్లు చనిపోతుంటే, అమెరికా పన్ను చెల్లింపుదారులపై భారం పడుతోంది,” అంటూ ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్.. మస్క్‌పై ఫైర్ : నవారో ఆరోపణలను ‘ఎక్స్’ కమ్యూనిటీ నోట్స్ ఫీచర్ ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేసి, అది తప్పుదోవ పట్టించే సమాచారమని పేర్కొంది. దీంతో వెనక్కి తగ్గని నవారో, మరింత తీవ్రంగా స్పందించారు. “వావ్! ఎలాన్ మస్క్ ఇలాంటి ప్రచారాన్ని అనుమతిస్తున్నారా? ఆ ఫ్యాక్ట్ చెక్ నోట్ అంతా అర్థరహితం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయకముందు భారత్ రష్యా నుంచి చమురు కొనలేదు. ఇప్పుడు కేవలం లాభం కోసమే కొంటోంది. భారత ప్రభుత్వ ప్రచార యంత్రాంగం గరిష్ఠ స్థాయిలో పనిచేస్తోంది. ఉక్రెయిన్లను చంపడం ఆపండి. అమెరికా ఉద్యోగాలను దూరం చేయడం ఆపండి,” అంటూ మస్క్‌ను టార్గెట్ చేస్తూ మండిపడ్డారు.

ట్రంప్ ప్రభుత్వంలోనూ ఇదే తీరు : భారత్ వాణిజ్య విధానాలపై ట్రంప్ హయాం నుంచే అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని స్వయంగా ట్రంప్ పలుమార్లు విమర్శించారు. ప్రస్తుత టారిఫ్ వార్ నేపథ్యంలో, రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడంపై అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య బృందం తీవ్ర నిరాశతో ఉన్నారని వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హ్యాసెట్ సైతం అంగీకరించారు. అయితే, ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం దృష్ట్యా ఈ సమస్యకు త్వరలోనే సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదేమైనా, నవారో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను మరోసారి బహిర్గతం చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad