Louvre Museum Robbery Case: అక్టోబర్ 19న పారిస్‌లోని ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో పట్టపగలే నిమిషాల వ్యవధిలో నెపోలియన్ కాలం నాటి ఆభరణాల చోరీ సంచలనం రేపిన విషయం తెలిసిందే. అత్యంత భద్రత కలిగిన మ్యూజియంలో రూ. 895 కోట్ల విలువైన ఆభరణాల చోరీ జరిగింది. అయితే ఇది సాధారణ దొంగల ముఠా పనే అని పారిస్ ప్రాసిక్యూటర్ లారే బేకువా వెల్లడించారు.
కరుడు గట్టిన నేరస్తులు ఈ దోపిడీకి పాల్పడే అవకాశం లేదని.. సాధారణ నేరాలకు పాల్పడేవారే ఈ పని చేసి ఉంటారని పారిస్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ కేసులో నలుగురు అనుమానితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నేర చరిత్రను పరిశీలిస్తే వారు వ్యవస్థీకృత ముఠాకు చెందిన దొంగలుగా కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుమానితులు శివారు ప్రాంతాల్లో చిన్న చిన్న నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా, అరెస్టయిన వారంతా స్థానికులేనని, వారిలో ఒక మహిళ కూడా ఉందని వివరించారు.
మ్యూజియంలో చోరీ ఘటనలో పరారీలో ఉన్న నాలుగవ అనుమానితుడి కోసం గాలిస్తున్నట్లు ఫ్రాన్స్ హోం మంత్రి లారెన్ నిజ్ పేర్కొన్నారు. ఇతడే దోపిడీకి ప్రధాన సూత్రధారి అతడే అయి ఉంటాడని.. చోరీ అనంతరం దుండగులు ఒక వజ్రాల కిరీటాన్ని అక్కడే వదిలి వెళ్లారని తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన కొన్ని పరికరాలు, గ్లోవ్స్‌ను కూడా వదిలేసి పరారయ్యారని.. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తే ఇది ఆర్గనైజ్‌డ్ ముఠా పనిగా కనిపించడం లేదని భావించారు. చోరీ ఘటనకు సంబంధించి విచారణను మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-review-on-slbc-tunnel-project-works/
అక్టోబర్ 19న పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఒకవైపు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ మార్గం ద్వారా దుండగులు లోపలకి ప్రవేశించి.. చాకచక్యంగా గ్యాలరీ పగలగొట్టారు. నెపోలియన్ కాలం నాటి వస్తువులు, ఆభరణాల్లో తొమ్మిదింటిని దోచుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఘటనలో సందర్శకులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


