Philippines Earthquake:ఫిలిప్పీన్స్ మళ్లీ ప్రకృతి విపత్తుతో వణికిపోయింది. తరచూ తుఫానులు, వరదలు, భూకంపాలు వంటి ఆపదలను ఎదుర్కొంటున్న ఈ దేశం మంగళవారం మధ్యాహ్నం మరోసారి భూకంపం బీభత్సానికి గురైంది. మధ్య ఫిలిప్పీన్స్‌లోని సెబు ప్రావిన్స్ కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్ది నిమిషాల పాటు వచ్చిన ఈ ప్రకంపనలు అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం మిగిల్చాయి.
60 మంది మృతి..
భూకంపం దెబ్బకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు కూలిపోయాయి. కాంక్రీట్ శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. రహదారులు పగుళ్లతో నిండిపోయి రవాణా పూర్తిగా దెబ్బతింది. క్షణాల్లోనే పట్టణం శిథిలాల గుట్టగా మారిపోయింది. అధికారికంగా విడుదలైన సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 60 మంది మృతిచెందారు. 100 మందికిపైగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/viral/beggar-buys-iphone-15-pro-max-with-coins-video-goes-viral/
రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా పదుల సంఖ్యలో వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం. అత్యవసర సహాయక బృందాలు కష్టతరమైన పరిస్థితుల్లోనూ వారిని సజీవంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. హెలికాప్టర్లు, క్రేన్లు, ప్రత్యేక యంత్రాలను ఉపయోగించి మట్టిగుట్టలను తొలగిస్తున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, సైన్యం సహకరిస్తున్నారు. ప్రతి నిమిషం ప్రాణాల రక్షణలో కీలకమైపోవడంతో అధికారులు వేగంగా పనిచేస్తున్నారు.
సునామీ వచ్చే ప్రమాదం..
భూకంపం తీరప్రాంతాలను కూడా ప్రభావితం చేసింది. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో తీరప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వందలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. ఆహారం, త్రాగునీరు, ఔషధాలు అందించేందుకు స్థానిక ప్రభుత్వం అత్యవసర ఏర్పాట్లు చేసింది.
విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు..
గత వారం తుఫాను బీభత్సం నుంచి బయటపడకముందే ఈ కొత్త విపత్తు ఫిలిప్పీన్స్ ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టింది. వరుసగా ఎదురవుతున్న ప్రకృతి విపత్తులు దేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులపై భారీ ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే తుఫాను వల్ల మౌలిక సదుపాయాలు ధ్వంసమైన సమయంలో ఈ భూకంపం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్కులు, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పరిస్థితిని అంచనా వేయడం మరింత కష్టమైంది.
ప్రజలు భయాందోళనల్లో మునిగిపోయారు. ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆందోళన, మరోవైపు తమ ఇళ్లు శిథిలాలుగా మారాయి. చాలామంది శిథిలాల కింద చిక్కుకున్న బంధువుల గురించి ఆరా తీస్తూ ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల వద్ద గుమిగూడుతున్నారు.
Also Read: https://teluguprabha.net/gallery/best-time-to-eat-curd-for-better-digestion-and-health/
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అన్ని అధికారులను ప్రాణరక్షణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మౌలిక వసతుల పునరుద్ధరణ, రవాణా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులకు కూడా దృష్టి సారించారు. అంతర్జాతీయ సహాయం కోసం పిలుపునిచ్చారు. ఇప్పటికే కొన్నిదేశాలు సహాయం అందించేందుకు సిద్ధమయ్యాయి. సహాయక బృందాలు, ఆర్థిక సాయం, వైద్య పరికరాలు పంపేందుకు చర్చలు ప్రారంభమయ్యాయి.
బిలియన్ల డాలర్లలో..
ఈ భూకంపం వల్ల విద్యా సంస్థలు, వ్యాపారాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పాఠశాలలు మూతపడగా, కార్యాలయాలు కార్యకలాపాలను నిలిపివేశాయి. పర్యాటక ప్రాంతాలు ఖాళీ చేయింఛారు. ఆర్థిక నష్టం ఎంతమేర జరిగిందో ఇంకా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. కానీ నష్టం బిలియన్ల డాలర్లలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భూకంప కేంద్రం సెబు ప్రావిన్స్ అయినప్పటికీ దాని ప్రకంపనలు సమీప ప్రాంతాలైన బొహోల్, నెగ్రోస్, లేయ్టే ద్వీపాలలో కూడా స్పష్టంగా అనుభవించబడ్డాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్లు వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోయారు. కొన్నిచోట్ల రహదారులు మూసుకుపోయాయి. రక్షణ చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.


