ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కెనడా(Canada)లో అయితే ఓ విమానం ఏకంగా పల్టీలు కొట్టింది. అమెరికాలోని మినియాపొలిస్ నుంచి 80 మంది ప్రయాణికులతో బయల్దేరిన డెల్టా ఎయిర్ లైన్స్(Delta Airlines) విమానం కెనడాలోని ఒంటారియో టొరంటో ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్‌కు దిగింది. అయితే ఆ సమయంలో మంచు విపరీతంగా ఉండటంతో విమానం అదుపుతప్పి పూర్తిగా తిరగబడింది. హుటాహుటిన ఎయిర్ పోర్టు సిబ్బంధి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత మైనస్ 8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోయిందని అధికారులు చెప్పారు. తిరగబడిన విమానంలో నుంచి ప్రయాణీకులను బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఇటీవలే నార్త్ అమెరికా వాషింగ్టన్ డీసీలో యూఎస్ ఆర్మీ హెలికాప్టర్, ప్యాసింజర్ ప్లేన్ పరస్పరం ఢీకొట్టడంతో 67 మంది ప్రయాణికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం విధితమే.