PM Modi-Trump meeting soon: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో జరగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో వీరిద్దరూ కలవనున్నట్లు సమాచారం. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో వీరి మధ్య భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 15-17 వరకు ఫ్రాన్స్‌లోని ఎవియన్ లే బైన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. జీ7 కూటమిలో భాగస్వామిగా ఉన్న భారత్‌కు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ ఇందులో పాల్గొననున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగశాఖ తెలిపింది. ట్రంప్ కూడా ఈ సమ్మిట్‌కు హాజరవుతారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ అమెరికా మీడియా తెలిపింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక వెలువడలేదు.
Also Read: University of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలకన్
హర్మూజ్ జలసంధి, చమురు సంక్షోభంపైనే చర్చ..
ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడం, కీలకమైన వ్యూహాత్మక రంగాల్లో సహకారం వంటి విషయాలపై వీరిద్దరూ చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు సంక్షోభం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వలసదారులపై ట్రంప్ తీసుకొస్తున్న బిల్లులపైనా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కాగా, చివరిగా 2025 ఫిబ్రవరిలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ భేటీ కానుండటంపై ప్రపంచ దేశాలకు ఆసక్తి నెలకొంది.

