PM Modi Praises Indian Diaspora In Trinidad: కరేబియన్ దీవుల్లో భారతీయ సంస్కృతిని సజీవంగా నిలిపిన ధైర్యవంతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారి పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ, నేటి తరానికి కొత్త ఆశలు రేకెత్తించారు. ట్రినిడాడ్ అండ్ టోబాగోలో భారతీయ సమాజంతో మోదీ సమావేశం ఎలాంటి కీలక ప్రకటనలకు వేదికైంది.? వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆ హామీలేంటి? తెలుసుకుందాం రండి…!
ట్రినిడాడ్‌లో ప్రధాని మోదీ ప్రసంగం: పూర్వీకుల త్యాగాలు – ప్రవాసులకు కొత్త ఆశలు
ట్రినిడాడ్ అండ్ టోబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రవాసులను “ధైర్యానికి ప్రతీకలు”గా అభివర్ణించారు. బ్రిటిష్ పాలనలో “గిర్మిత్ కూలీల”గా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, తమ సంస్కృతిని, సంప్రదాయాలను నిలబెట్టుకున్న వారి పూర్వీకుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. కౌవాలోని నేషనల్ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో జరిగిన సమావేశంలో “మనమంతా ఒకే కుటుంబంలో భాగం” అని పేర్కొంటూ, ట్రినిడాడ్ జనాభాలో 45% మంది భారతీయ మూలాలున్నవారేనని తెలిపారు.
ఈ సందర్భంగా, ట్రినిడాడ్ ప్రధాని కమ్లా పెర్సాద్ బిస్సేర్‌ను మోదీ “బిహార్ కుమార్తె”గా సంబోధించారు. ఆమె పూర్వీకులు బిహార్‌లోని బక్సర్ జిల్లాకు చెందినవారని, 2012లో ఆమె స్వయంగా తమ తాతముత్తాతల ఊరు భేలుపూర్‌ను సందర్శించారని గుర్తు చేశారు.
భారతదేశం – అవకాశాల దేశం: భారత్ ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక శక్తుల్లో ఒకటిగా అవతరిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. ఈ అభివృద్ధి ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉండేలా కృషి చేస్తున్నామని, భారత్ ఇప్పుడు అవకాశాల దేశంగా మారిందని స్పష్టం చేశారు. ప్రతి ప్రవాసుడు భారతదేశానికి దూతగా భావించాలని, వారు మన సాంస్కృతిక విలువలకూ, సంప్రదాయానికీ ప్రతీకలని, మన దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు.
మోదీ పర్యటనలో భాగంగా, ట్రినిడాడ్ ప్రధాని కమ్లా పెర్సాద్ బిస్సేర్, మోదీకి తమ దేశ అత్యున్నత సత్కారం “ది ఆర్డర్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టోబాగో”ను అందజేస్తామని ప్రకటించారు. 1999 తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్‌ను సందర్శించడం ఇదే తొలిసారి.
కీలక ప్రకటనలు – భవిష్యత్తుకు మార్గదర్శనం: ముఖ్యంగా, భారతీయ మూలాలున్న ఆరో తరం వరకు ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI)’ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ కార్డులతో వారికి భారత్‌లో ఉద్యోగం, విద్య, ఆస్తి కొనుగోలు వంటి సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. “మీరు మాతో కేవలం రక్త సంబంధాలతో మాత్రమే కాకుండా, మాతృభూమిపై అనుభూతితో మాతో అనుసంధానమయ్యారు. భారత్ మీకు ఆహ్వానం పలకుతోంది ” అని మోదీ ప్రవాసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చివరగా, ప్రవాస భారతీయులు తమ పూర్వీకుల ఊళ్లను సందర్శించాలని, తమ పిల్లలు, మిత్రులతో కలిసి భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానించారు. ఆధునిక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ UPIకి అనుమతిచ్చిన కరిబియన్ దేశాల్లో ట్రినిడాడ్ మొదటి దేశంగా నిలిచినందుకు అభినందించారు. చంద్రయాన్-3 విజయం, గగన్‌యాన్ మిషన్ ప్రస్తావనతో భారత్ అంతరిక్ష విజయాలను కూడా మోదీ వివరించారు. “నక్షత్రాలను లెక్కపెట్టడం కాదు, వాటిని చేరడం మన లక్ష్యం” అని ఆయన అన్నారు.