Prince Andrew scandal: బ్రిటన్ రాజకుటుంబాన్ని మరోసారి వివాదాల్లోకి నెడుతూ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాణి ఎలిజబెత్ కుమారుడు, కింగ్ చార్లెస్ సోదరుడు అయిన ప్రిన్స్ ఆండ్రూ తన 17 ఏళ్ల వయసులో లైంగిక దాడికి పాల్పడినప్పుడు, అది తన ‘జన్మహక్కు’ అన్నట్లుగా ప్రవర్తించాడని జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక కుంభకోణం బాధితురాలు వర్జీనియా గిఫ్రే తన స్వీయచరిత్రలో ఆరోపించారు. ఇటీవల మరణించిన ఆమె రాసిన “నోబడీస్ గర్ల్: ఎ మెమొయిర్ ఆఫ్ సర్వైవింగ్ అబ్యూజ్ అండ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్” అనే పుస్తకంలోని కొన్ని కీలక భాగాలను ‘ది గార్డియన్’ పత్రిక ప్రచురించింది.
అమెరికాకు చెందిన వివాదాస్పద ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ తనను లైంగిక బానిసగా మార్చాడని, ప్రిన్స్ ఆండ్రూ సహా పలువురు ప్రముఖులతో బలవంతంగా లైంగిక సంబంధాలు పెట్టుకునేలా చేశాడని గిఫ్రే గతంలోనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన పుస్తకంలో, ప్రిన్స్ ఆండ్రూతో తనకు మూడుసార్లు లైంగిక సంబంధం ఏర్పడిందని, అందులో మొదటిసారి తన వయసు 18 ఏళ్ల లోపే అని ఆమె పేర్కొన్నారు.
2001 మార్చిలో లండన్‌లో తొలిసారి ప్రిన్స్‌ను కలిసినప్పటి సంగతులను ఆమె వివరించారు. ఆ సమయంలో తన వయసును సరిగ్గా 17 ఏళ్లని అంచనా వేసిన ఆండ్రూ, “మా అమ్మాయిలు నీకంటే కొంచెం చిన్నవాళ్లు,” అని అన్నట్లు ఆమె రాశారు. ఆ తర్వాత సెంట్రల్ లండన్‌లోని ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లామని, అక్కడ ఆండ్రూ విపరీతంగా చెమటలు పడుతూ అసహజంగా డ్యాన్స్ చేశాడని పేర్కొన్నారు. అనంతరం ఎప్స్టీన్ మాజీ స్నేహితురాలు గిస్లైన్ మ్యాక్స్‌వెల్ ఇంటికి వెళ్లాక, ప్రిన్స్ ఆండ్రూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.
“అతను స్నేహంగానే ఉన్నా, అతని ప్రవర్తనలో ఒకరకమైన అధికారం కనిపించింది. నాతో సెక్స్ చేయడం అతని జన్మహక్కులా భావించాడు,” అని గిఫ్రే తన పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఉదయం మ్యాక్స్‌వెల్ తనతో, “నువ్వు బాగా చేశావ్. ప్రిన్స్ చాలా ఆనందించాడు,” అని చెప్పిందని, ఆండ్రూకు ‘సేవ’ చేసినందుకు ఎప్స్టీన్ తనకు $15,000 చెల్లించాడని ఆమె వెల్లడించారు.
ఈ ఆరోపణలను ప్రిన్స్ ఆండ్రూ ఎప్పటినుంచో ఖండిస్తూ వస్తున్నారు. కోర్టు విచారణను తప్పించుకోవడానికి ఆయన గిఫ్రేకు మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ చెల్లించారు. ఈ కుంభకోణం వల్ల రాజకుటుంబంలో ఆండ్రూ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది. ఆయన బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం కూడా అరుదైపోయింది. కాగా, వర్జీనియా గిఫ్రే ఈ ఏడాది ఏప్రిల్ 25న పశ్చిమ ఆస్ట్రేలియాలోని తన ఫామ్‌లో మరణించారు. ఆమె రాసిన ఈ పుస్తకం అక్టోబర్ 21న విడుదల కానుంది.
ALSO READ: Trump on BRICS: బ్రిక్స్ అంటే డాలర్‌పై దాడి – నా సుంకాల దెబ్బకే కూటమి విచ్ఛిన్నం: ట్రంప్


