Russia nuclear test: రష్యా అమ్ములపొదిలో అపరిమిత శక్తి కలిగిన సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. ప్రపంచ దేశాల అణు భయాన్ని మరింత పెంచుతూ, అణుశక్తితో నడిచే వినాశకరమైన ‘బూరెవెస్ట్‌నిక్’ (Burevestnik) క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించినట్లు దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు.
ఈ క్షిపణి ప్రత్యేకత ఏంటంటే – దీనికి అపరిమితమైన పరిధి (Unlimited Range) ఉంది. అంటే, భూమిపై ఎక్కడికైనా చేరుకునే సామర్థ్యం దీని సొంతం. పరీక్షల సమయంలో ఇది ఏకంగా 15 గంటల పాటు గాల్లోనే ఉండి, 14 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని పుతిన్ వెల్లడించారు. ఈ అసాధారణ సామర్థ్యం కలిగిన అస్త్రాన్ని వెంటనే మోహరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆయన సాయుధ దళాలను ఆదేశించారు. బూరెవెస్ట్‌నిక్ మోహరింపుతో, రష్యా ప్రపంచ వ్యూహాత్మక శక్తిలో కీలక మార్పు తీసుకువస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల రష్యా నిర్వహించిన ‘అణు’ విన్యాసాలను పుతిన్ స్వయంగా పర్యవేక్షించడం, ఆ వెంటనే ఈ క్షిపణి విజయాన్ని ప్రకటించడం ప్రపంచానికి ఒక బలమైన సంకేతాన్ని పంపింది. సైనిక కమాండర్లతో జరిగిన సమావేశంలో, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ కూడా ఉక్రెయిన్‌లో కీలక విజయాలు సాధిస్తున్నట్లు వివరించారు. ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 10వేల మంది సైనికులను చుట్టుముట్టామని, 31 బెటాలియన్లతో కూడిన బలమైన బృందాన్ని కూడా అడ్డుకున్నామని తెలిపారు.
బూరెవెస్ట్‌నిక్ మోహరింపుతో, రష్యా ఆయుధాగారంలోకి చేరిన ఈ కొత్త ‘అణుశక్తి’ క్రూయిజ్ క్షిపణి, భవిష్యత్తు ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ పరిణామం ప్రపంచ అణ్వాయుధ పోటీని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.


