Qatar Airways Vegetarian Passenger Chokes To Death: విమానంలో ప్రయాణిస్తున్న ఓ 85 ఏళ్ల శాకాహారి పట్ల ఖతార్ ఎయిర్‌వేస్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యం ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ముందుగా ఆర్డర్ చేసిన శాకాహార భోజనం అందుబాటులో లేదని చెప్పి, మాంసాహార భోజనంలోని మాంసం ముక్కలు పక్కన పెట్టి తినమని చెప్పడంతో, ఆ ప్రయత్నంలో గొంతులో మెతుకు ఇరుక్కుని ఆ వృద్ధుడు మరణించిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..
దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన రిటైర్డ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక జయవీర (85), 2023 జూన్ 30న లాస్ ఏంజిల్స్ నుంచి కొలంబోకు ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో బయలుదేరారు. 15.5 గంటల సుదీర్ఘ ప్రయాణం కావడంతో, ఆయన ముందుగానే శాకాహార భోజనాన్ని ఆర్డర్ చేసుకున్నారు. అయితే, విమానంలో భోజనం వడ్డించే సమయంలో, శాకాహారం అందుబాటులో లేదని విమాన సిబ్బంది తెలిపారు. బదులుగా, మాంసాహార భోజనాన్ని ఇచ్చి, “మాంసం ముక్కలు పక్కన పెట్టి తినండి” అని నిర్లక్ష్యంగా సలహా ఇచ్చారు.
ALSO READ: JeM Women Wing Strategy : జైష్-ఎ-మహమ్మద్ కొత్త కుట్ర..చదువుకున్న ముస్లిం మహిళలే టార్గెట్!
తప్పనిసరి పరిస్థితుల్లో, ఆయన ఆ భోజనాన్ని తినేందుకు ప్రయత్నించగా, అన్నం గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడలేదు. వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో విమానాన్ని స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు మళ్లించారు. అక్కడ ఆసుపత్రికి తరలించగా, ఊపిరితిత్తుల్లోకి ఆహారం వెళ్లడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ (ఆస్పిరేషన్ న్యుమోనియా) సోకిందని, దానివల్లే 2023 ఆగస్టు 3న ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.
సంస్థపై దావా:
ఈ ఘటనపై డాక్టర్ అశోక కుమారుడు సూర్య జయవీర, తాజాగా ఖతార్ ఎయిర్‌వేస్‌పై రాంగ్‌ఫుల్ డెత్ (అన్యాయపు మరణం) దావా వేశారు. తమ తండ్రి మృతికి ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యమే కారణమని, సరైన భోజనం అందించడంలో, అత్యవసర వైద్య సహాయం చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. మాంట్రియల్ కన్వెన్షన్ నిబంధనల ప్రకారం, నష్టపరిహారంగా $128,821 చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో విమానయాన సంస్థలు ప్రయాణికుల ఆహార నియమాల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ALSO READ: UNSC: ఐరాసలో భారత్ శాశ్వత సభ్యత్వానికి యూకే మద్దతు.. కీలక రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు


