Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Russia: 800 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం.. కీవ్ పై రష్యా భీకర దాడి..!

Russia: 800 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం.. కీవ్ పై రష్యా భీకర దాడి..!

Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరంగా మారాయి. ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఉక్రెయిన్ పై రష్యా ఏకంగా 800కుపైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. యుద్ధం మొదలైనప్పట్నుంచి ఈ స్థాయిలో గగనతల దాడులు చేపట్టడం ఇదే మొదటిసారి. అదేవిధంగా తొలిసారి ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ ప్రతినిధి యూరీ ఇన్హాత్‌ ఈ దాడులను ధ్రువీకరించారు. మాస్కో 13 క్షిపణులూ ప్రయోగించిందన్నారు. 747 డ్రోన్లు, నాలుగు క్షిపణులను నేలకూల్చినట్లు చెప్పారు. 54 డ్రోన్లు, తొమ్మిది క్షిపణులు కీవ్‌ సహా దేశవ్యాప్తంగా 37 ప్రాంతాలను తాకినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు.

- Advertisement -

Read Also: Rohit Sharma: రో-కో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్టార్లు వచ్చేస్తున్నారోచ్..!

మంత్రుల భవనం ధ్వంసం
అంతేకాకుండా, రష్యా దాడుల్లో కీవ్‌లోని మంత్రుల భవనం పాక్షికంగా ధ్వంసమైంది. ఇందులో ఉక్రెయిన్‌ మంత్రుల నివాసాలు, కార్యాలయాలు ఉన్నాయి. శత్రుదేశం దాడిలో తొలిసారి ఓ ప్రభుత్వ భవనం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ ప్రధాని యూలియా స్వైరెదెన్కో తెలిపారు. ‘‘భవనాన్ని మళ్లీ నిర్మించుకోవచ్చు.. కానీ, ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కదా’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సంకల్పంతో క్రెమ్లిన్‌ దుశ్చర్యలను అడ్డుకోవచ్చన్నారు. మరోవైపు.. కీవ్‌ సైతం రష్యాకు చెందిన ద్రుజ్హబా చమురు పైప్‌లైన్‌పై ప్రతీకార దాడులు చేపట్టింది.

Read Also: Trump: వెనుజువెలా హస్తగతం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు..!

పుతిన్ సంచలన వ్యాఖ్యలు

ఇకపోతే, ఇటీవలే ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచే ఏ దేశాలనైనా వదిలిపెట్టబోమన్నారు. ఆ దేశంలో తమ దళాలను మోహరించే ఏ దేశాలనైనా తమ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని పుతిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉంటుందన్నారు. ఇటువంటి బలగాల మోహరింపు దీర్ఘకాలిక శాంతికి అనుకూలంగా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్‌కు ఉన్న సన్నిహిత సైనిక సంబంధాలు ఇరుదేశాల మధ్య సంఘర్షణకు మూలకారణాలని అన్నారు. ఇరుదేశాల మధ్య  శాంతిచర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో ఇతర దళాలను మోహరించాల్సిన అవసరం ఏముంటుందని పుతిన్‌ ప్రశ్నించారు. దీర్ఘకాలిక శాంతికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటే.. అసలు ఉక్రెయిన్‌లో ఇతర దళాలు మోహరించాల్సిన అవసరమే ఉండదన్నారు. తాము చేసుకున్న ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉంటుందని తెలిపారు. 26 ఐరోపా దేశాల నేతలు గురువారం పారిస్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky)తో సమావేశమైన నేపథ్యంలో పుతిన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad