Russia Banned Whatsapp: తమ దేశంలో వాట్సాప్ సేవలను నిషేధిస్తూ రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక చట్టాలకు అనుగుణంగా లేదన్న కారణంతో ఈ విషేధం విధించినట్లు రష్యా పేర్కొంది. దాని స్థానంలో స్థానిక మెసెంజర్ ‘మ్యాక్స్’ను వినియోగించాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
రష్యా ప్రభుత్వం వాట్సాప్ సేవలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. మెటా సంస్థ రష్యా స్థానిక చట్టాలను పాటించడం లేదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. వినియోగదారుల డేటా భద్రత విషయంలో సహకరించడం లేదని పేర్కొన్నారు. అందుకే వాట్సాప్‌కు బదులుగా రష్యా సొంతంగా అభివృద్ధి చేసిన ‘MAX’ (మ్యాక్స్) అనే నేషనల్ మెసెంజర్ యాప్‌ను వాడాలని తమ దేశ పౌరులను విజ్ఞప్తి చేస్తోంది.
కాగా, రష్యాలో దాదాపు 10 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నట్లు సమాచారం. తాజా నిర్ణయంతో వారందరికీ కమ్యూనికేషన్ నిలిచిపోగా.. దీనిపై మెటా సంస్థ నుంచి పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలను సురక్షితమైన కమ్యూనికేషన్ నుంచి దూరం చేయడానికే ప్రభుత్వం యత్నిస్తోందని.. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ నిఘా ప్రయోజనాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులను తిరిగి కనెక్ట్ చేయడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. అయితే రష్యా ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర మెటా యాప్‌లను గతంలోనే నిషేధించిన విషయం తెలిసిందే.
రష్యన్ – అమెరికన్ కంపెనీల మధ్య ఉద్రిక్తతల కారణంగా ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి.. అమెరికన్ కంపెనీలపై రష్యా కఠిన చర్యలు తీసుకుంటుండగా.. తాజాగా మాస్కో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మెటా.. తమ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే, వాట్సాప్‌ను కొనసాగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని రష్యా పేర్కొంది.

