Russia Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉధృతమైంది. ఆదివారం తెల్లవారుజామున రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై భారీ స్థాయిలో డ్రోన్‌లు, క్షిపణులతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం నలుగురు మరణించగా, దాదాపు 67 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో రష్యా మొత్తం 595 డ్రోన్‌లు, 48 క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే వీటిలో 568 డ్రోన్‌లు, 43 క్షిపణులను తమ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా నిర్వీర్యం చేశాయని ఉక్రెయిన్ వైమనిక దళాలు తెలిపాయి.
టార్గెట్ రాజధాని కీవ్..
ఈ దాడుల ప్రధాన లక్ష్యం రాజధాని కీవ్ అని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ స్థాయిలో రష్యా కీవ్ పై దాడులు చేయలేదని తెలుస్తోంది. దాదాపు 12 గంటలపాటు కొనసాగిన ఈ పేలుళ్ల శబ్ధాలు, గగనతల రక్షణ దళాల ప్రత్యామ్నాయ దాడులు నగరమంతా మారుమోగాయి. ఈ దాడుల్లో తాజాగా నిర్మించిన ఇండ్ల వరుసలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కార్లు, పలు అపార్ట్‌మెంట్ భవనాల్లో కిటికీలు ధ్వంసమైపోయాయి. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు భూగర్భ మెట్రో స్టేషన్లకు తరలిపోయారు.
ఉక్రెయిన్ దక్షిణభాగంలోని జపోరిజ్జియా నగరం కూడా రష్యా దాడులకు గురైంది. అక్కడ పలు కర్మాగారాలు, నివాస భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని సైన్యం వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సమాజం తక్షణం రష్యా ఎనర్జీ ఆదాయ వనరులను నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలంటూ మరోసారి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అమెరికా, యూరప్, జీ7, జీ20 దేశాలు బలమైన నిర్ణయం తీసుకోవాలని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు రష్యాపై అదనపు ఆంక్షలకు ఒప్పుకోకపోవడంపై జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే దాడుల సందర్భంలో పొరుగు దేశమైన పోలాండ్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అక్కడి వైమానిక దళం యుద్ధ విమానాలను గాల్లోకి దించి అప్రమత్తమయ్యింది. పరిస్థితి అదుపులోకి రాగానే గగనతలం మళ్లీ తెరచబడింది.


