Russia Offers India Bigger Oil Discounts: అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుత తరుణంలో, రష్యా భారత్‌కు చవకగా ముడిచమురును సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. అమెరికా ఆంక్షలు, తీవ్రమైన విమర్శల మధ్య రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించడంపై భారత్ ఆలోచిస్తున్న వేళ, రష్యా భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రష్యా తమ యూరల్ ముడిచమురుపై భారత్‌కు బ్యారెల్‌కు 3 నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ తగ్గింపు సెప్టెంబర్ చివరిలో, అక్టోబర్‌లో లోడ్ అయ్యే కార్గోలకు వర్తిస్తుంది. జూలైలో ఈ తగ్గింపు కేవలం 1 డాలర్ మాత్రమే ఉండగా, గత వారం అది 2.5 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ఏకంగా 3-4 డాలర్ల డిస్కౌంట్ ఇవ్వడం గమనార్హం.
ALSO READ: Peter Navarro : మోదీ.. పుతిన్.. జిన్‌పింగ్‌లతో భేటీ.. భారత్‌పై ట్రంప్ సలహాదారు ఫైర్!
ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే భారత్‌పై సుంకాలు రెట్టింపు చేసి 50 శాతానికి పెంచింది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు సహకరిస్తోందని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులకు ప్రధాన కేంద్రంగా మారింది. వాషింగ్టన్ పదే పదే చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా, ఢిల్లీ తన రష్యా, చైనా స్నేహబంధాన్ని పటిష్టం చేసుకుంటోంది.
ప్రత్యర్థులు కాదు భాగస్వాములు..
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత్-రష్యా సంబంధాలు “ప్రత్యేకం” అని స్పష్టం చేశారు. అదేవిధంగా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశమై, రెండు దేశాలు ప్రత్యర్థులు కాకుండా భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ALSO READ: Shehbaz Sharif : భారత్-రష్యా సంబంధాలు అద్భుతం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో గతంలో భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌పై పుతిన్ దాడి చేయడానికి ముందు భారత్ రష్యా చమురును పెద్దగా కొనుగోలు చేసేది కాదని, కానీ ఇప్పుడు రష్యా చమురు శుద్ధి చేసి, దానిని ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు అధిక ధరకు అమ్ముతూ, రష్యా యుద్ధ యంత్రానికి ఆజ్యం పోస్తోందని ఆరోపించారు.
అయితే, భారత్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా చమురు కొనుగోలును నిషేధించేలా ఎలాంటి ఆంక్షలు లేవని, పైగా అమెరికా కూడా రష్యా చమురును పూర్తిగా నిషేధించలేదని భారత్ స్పష్టం చేసింది. ఆగస్టు ప్రారంభంలో కొనుగోలులో కొంత విరామం ఉన్నప్పటికీ, భారత్ రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.
ALSO READ: Kim Jong Un : చైనాలో కిమ్ – పుతిన్ – జిన్‌పింగ్ కొలువు.. అమెరికా గుండెల్లో దడ!


